మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు
మెట్పల్లి (మీడియాబాస్ నెట్వర్క్): నిరుద్యోగ సమస్య తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రతి మండాలనికి ఒక స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువతకు మేలు చేయవచ్చని మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి అర్బన్ కాలనీ (అమ్మక్కపేట్ గ్రామ శివారు)లో ప్రతిమ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాటా స్ట్రైవ్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమతో కలిసి విద్యాసాగర్ రావు సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు టాటాస్ట్రైవ్లో శిక్షణ పొందిన విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడారు. టాటాస్ట్రైవ్లో శిక్షణ పొందని విద్యార్థులకు దేశవిదేశాల్లో ఉద్యోగలు సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు అమ్మక్కపేట్లో, రాయికల, నాగరంలో టాటాస్ట్రైవ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి బ్యాంకింగ్, ఏసీ సోలార్ వంటి వాటిపై శిక్షణ కల్పించి వెయ్యికిపైగా ఉద్యోగలు కల్పించడం జరిగిందన్నారు. శిక్షణ తరగతులను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశ విదేశాలతో పాటు ప్రపంచంలోనే టాటా స్ట్రైవ్ శిక్షణ సంస్థకు ఉన్నతమైన గుర్తింపు ఉందని, ఈ సంస్థ ద్వారా ఎందరో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మండలానికి నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టయితే వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని అన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు, చిన్నచిన్న ఉద్యోగల వల్లనే ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో భారతదేశం తలెత్తుకుని నిలబడుతుందని అన్నారు. టాటాస్ట్రైవ్ శిక్షణ కేంద్రం చుట్టూ ప్రహారీతో పాటు ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు.
అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా ఎన్నో ఉన్నత పదవులు పొందని చెన్నమనేని విద్యాసాగర్ రావు ముందుస్తు దూర దృష్టితో టాటాస్ట్రైవ్ ను నెలకొల్పి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాల బాట చూపిస్తున్నారని అన్నారు. ఈ సంస్థ ద్వారా అమ్మక్కపేట్లోని శిక్షణ కేంద్రంలో 36 బ్యాచ్లలో 583 మంది ట్రైనింగ్ పూర్తి చేసి 392 మంది ఉద్యోగాలు సాధించడం జరిగిందని, ఇంకా 37 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, మాజీ గవర్నర్ సాగర్ రావు, టాటాస్ట్రైవ్ ల సౌజన్యంతో ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు అమ్మక్కపేట్, రాయికల్, నాగరంలోని శిక్షణ కేంద్రాల ద్వరా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాటాస్ట్రైవ్ ప్రతినిధులు, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.