సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ నుంచి బస్వాపూర్ బయలుదేరారు. ఆయనను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేఏ పాల్ బస్వాపూర్ వెళితే ఉద్రిక్తత నెలకొంటుందని అందుకని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. తనను ఎందుకు అడ్డుకున్నారని కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త అనిల్.. కేఏ పాల్‌పై దాడి చేశాడు. అతడ్ని పోలీసులు అడ్డుకున్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తనను హత్య చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయని ఆరోపించారు. ఈ దాడి అనంతరం పోలీసులు కేఏ పాల్‌ను హైదరాబాద్ పంపించారు.
కేఏ పాల్‌పై దాడి చేసిన అనిల్.. తెలంగాణ వ్యతిరేకశక్తులను రాష్ట్రంలో తిరగనివ్వమంటూ హెచ్చరిక చేశాడు. సీఎం కేసీఆర్, కేటీఆర్ పై ఎవడైనా విమర్శలు చేస్తే భౌతిక దాడులు చేస్తామని తెలిపాడు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారిపై దాడి చేస్తామన్నాడు. రాష్ట్రంలో కేఏ పాల్ ను తిరగనివ్వమని, కేఏ పాల్ పెద్ద దొంగ, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు దాడికి పాల్పడ్డాను అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు.
గత కొన్ని రోజులుగా కేఏ పాల్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇవాళ తనపై జరిగిన దాడికి సంబంధించిన కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ సమక్షంలోనే తనపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా, ప్రజల నుంచి వస్తున్నాయా అని పాల్ ప్రశ్నించారు. తనపై దాడికి చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలేనని పాల్ మండిపడ్డారు. జక్కాపూర్ లో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేశారు. దూకుడుగా వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. పాల్‌ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్త అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.