టైటిల్‌: ‘దర్జా’
నటీనటులు: సునీల్, అనసూయ భరద్వాజ్, షఫీ, ఆమని, ’30’ ఇయర్స్ పృథ్వీ, అక్సా ఖాన్, షమ్ము, ‘షకలక’ శంకర్, ‘మిర్చి’ హేమంత్, ‘ఛత్రపతి’ శేఖర్, ‘షేకింగ్’ శేషు, ‘జబర్దస్త్’ నాగిరెడ్డి, సమీర్ తదితరులు
కథ: నజీర్
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: దర్శన్
సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
నిర్మాత: శివ శంకర్ పైడిపాటి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సలీం మాలిక్
విడుదల తేదీ: జూలై 22, 2022

బుల్లితెర‌పై ఫుల్ ఎన‌ర్జిటిక్ షోలు చేస్తూ, బిగ్‌స్క్రీన్‌పై కూడా చ‌మ‌క్కున మెరుస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ భరద్వాజ్. యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ ఓ కీలక పాత్రలో నటించారు. అనసూయ, సునీల్ కాంబినేషన్లో సినిమా రావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆస‌క్తిపెరిగిపోయింది. నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి నిర్మాణంలో, డైరెక్ట‌ర్ సలీమ్‌ మాలిక్ తెర‌కెక్కించిన ఈ సినిమా ప్ర‌చార చిత్రాల‌కు ఇప్ప‌టికే మంచి స్పందన వ‌చ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘దర్జా’పై ఆసక్తి పెరిగింది. హాట్ టాపిక్‌గా మారి, ఎన్నో అంచనాల మధ్య తాజాగా(జులై 22న‌)ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్జా మూవీ ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
ఈ సినిమాలో అన‌సూయ బందరు కనకం అలియాస్‌ కనక మహాలక్ష్మీ అనే ఓ సారా వ్యాపారి పాత్ర‌లో న‌టించింది. కనకం అంటే బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు హడల్‌. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్‌), అనుచరుడు సర్కార్‌ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగుతుంది. సీన్ కట్‌ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్‌ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎస్సై శివ శంకర్ పైడిపాటి పాత్ర‌లో సునీల్ వ‌స్తాడు. ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌రు పాత్ర‌లో క‌నిపిస్తాడు. వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్‌ చేస్తాడు. అంతేకాదు గణేష్‌ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి.. అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు.

అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్‌ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకంతో పాటు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ అడ్డుక‌ట్ట వేశాడా లేదా? అనేదే మిగతా కథ.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
ఈ సినిమా అంతా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అనసూయ అని చెప్పొచ్చు. రంగస్థలంలో రంగమ్మత్తగా, ‘పుష్ప’లో దాక్షాయణిగా తనదైన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పాత్ర పోషించి మెప్పించింది. బందరు కనకంగా అనసూయ అదరగొట్టేసింది. ఆమె డైలాగ్‌ డెలివరీ, యాక్టింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఇక పవర్‌ఫుల్‌ ఎస్సై శంకర్‌ పాత్రలో సునీల్‌ ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీశాడు. మూగబ్బాయి గణేశ్‌గా అరుణ్‌ వర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కనకం తమ్ముడు బళ్లారిగా సమీర్‌, డ్రైవర్‌ జట్కాగా వీరబాబు, ఎస్సై రవిగా రవి పైడిపాటితో పాటు ఆమని, షేకింగ్‌ శేషు, షకలక శంకర్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.

విశ్లేష‌ణ‌:
నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి ఈ సినిమాను కమర్షియల్‌ వ్యాల్యూస్‌తో తెర‌కెక్కించారు. ప్రొడ్యూస‌ర్స్‌కి కొత్త సినిమా అయిన‌ప్ప‌టికీ నిర్మాణ‌ప‌రంగా ఫుల్ మార్కులు ఇవ్వొచ్చు. పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఒక ప‌ట్ట‌ణంలోని అనేక స‌మ‌స్య‌ల‌ని ప‌రిష్క‌రించిన ఓ యువతి.. పెద్ద అయిన తర్వాత ప్రజలకు ఎలా ప్రాబ్లమ్‌గా మారింది? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే ఈ సినిమా ప్ర‌ధాన క‌థాంశంగా ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన సినిమా ఇది. ఇందులో అన్నదమ్ములు, తల్లి కొడుకులు, అక్కా చెల్లెల సెంటిమెంట్‌తో పాటు కావాల్సిన యాక్షన్‌, కమర్షియల్‌ వ్యాల్యూస్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు ఈ కథనంతా బందరుకు కొత్తగా వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్‌ మధ్యన చర్చగా నడిపించిన తీరు బాగుంది. ఎస్సై రవి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్‌తో కథ మొదలవుతుంది.ఇక బందరు కనకంగా అనసూయ ఎంట్రీతో కథ పరుగులు తీస్తుంది.

అనసూయ ఉన్నంత సేపు ప్రతి సీన్ ఉత్కంఠగా సాగుతుంది. ఒకవైపు కనకం అరాచకాలను క్రూరంగా చూపిస్తూనే.. మరోవైపు గణేష్‌, పుష్పల ప్రేమ కథను చెప్పుకొచ్చిన తీరు బాగుంటుంది. మధ్య మధ్యలో రంగ(షమ్ము), గీత(అక్సాఖాన్‌) కామెడీ సీన్స్‌ నవ్వులు పూయించినప్పటికీ.. కథంతా నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో సునీల్‌ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో సునీల్‌, అనసూయల మధ్య వచ్చే సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌లో సునీల్‌కు అనసూయ వార్నింగ్‌, ప్రీక్లైమాక్స్‌లో సునీల్‌ చేసే ఫైట్‌ సీన్స్‌ ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. కొత్త నటుల నుంచి కూడా తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు.

సాంకేతిక ప‌నితీరు:
ఈ సినిమాకు ప్రధాన బలం కమర్షియల్‌ వ్యాల్యూస్‌. నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి.. ఈ సినిమాను ముందుగా చిన్న బడ్జెట్‌తో ఈ సినిమాని చేయాలని అనుకున్నారు. సునీల్‌, అనసూయ ఓకే అయిన తర్వాత.. అవుట్‌ఫుట్ అద్భుతంగా వస్తుండటంతో.. ఇంకా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లారు. ముందు రెండు ఫైట్స్ అనుకుంటే.. తర్వాత నాలుగు ఫైట్స్ చేశారు, 8 రోజుల షూటింగ్ అనుకున్నది 18 రోజులు ఇలా, రామోజీ ఫిల్మ్ సిటీ, అవుట్ డోర్ షూటింగ్స్.. అన్నింటికీ భారీగానే ఖర్చు చేశారు. క్వాలిటీ, అవుట్‌పుట్ చూసిన తర్వాత.. బడ్జెట్ విషయంలో వెనుకాడలేదు. నిర్మాత‌ల‌కు ఇది మొదటి చిత్రం అయిన‌ప్ప‌టికీ నిర్మాణం పరంగా మంచి క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయ‌ని చెప్పొచ్చు. ఇక సినిమా మ‌రో ప్ల‌స్ పాయింట్ రాప్ రాక్ షకీల్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అక్సాఖాన్‌ స్పెషల్‌ సాంగ్‌ తెరపై అదిరిపోయింది. దర్శన్ సినిమాటోగ్రఫీ సూపర్ అని చెప్పొచ్చు. ఎడిటర్‌ ఎమ్.ఆర్. వర్మ ప‌ర్‌పెక్టుగా తీర్చిదిద్దాడు.

కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను పరుగులు పెట్టించాడు డైరెక్ట‌ర్ సలీమ్‌ మాలిక్. రొటీన్‌ స్టోరీనే అయినప్పటికీ.. కథనం ఆకట్టుకుంటుంది. ఫైన‌ల్‌గా చెప్పాలంటే
డాన్ లేడీగా అనసూయ యాక్టింగ్, పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ కోసం ఈ సినిమాను ‘దర్జా’గా థియేటర్స్‌ వెళ్లి చూడొచ్చు.

రేటింగ్: 3.5/5

https://www.youtube.com/watch?v=y_wmGjcXhYM

By admin