కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా
విశ్వంలోకి చేసే ప్రయాణమే ‘కళ’

కళా సృష్టి అనేది
మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి
ప్రతిమను రూపొందించడం లాంటిది

– వారాల ఆనంద్

అట్లా ఏదయినా ఒక కళ ను ఇష్టపడడం, ప్రేమించడం అలవాటయ్యాక మనిషి ఆలోచనల్లో అవగాహనలో, ఆచరణలో చాలా తేడా వస్తుంది. మొత్తంగా జీవితమే మారిపోతుంది. నేను సాహిత్యంతో పాటు సినిమాను ఇష్టపడి కొనసాగుతూ వున్న క్రమంలో నా అనుభవమూ అదే. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీ లో చేరిన తర్వాత నా పరిధి మరింత విస్తృత‌మైంది. దాంతో పాటు కరీంనగర్ ఫిలింసొసైటీలో ప్రధాన బాధ్య‌తను స్వీకరించాక భారతీయ సినిమాలతో పాటు ప్రపంచ సినిమా పైన పట్టు పెరిగింది. ఎన్నో ఉత్తమ ప్రపంచ సినిమాలను కఫిసో(కరీంనగర్ ఫిలిం సొసైటీ) సభ్యులకు చూపించాలనే ప్రయత్నం పెంచాం. కానీ 2002 నాటికి సినిమాల ప్రదర్శనలు సంభందించి టాకీస్ సమస్యని బాగా ఎదుర్కొన్నాం. దాంతోపాటు ఉదయాన్నే సినిమాలకు రావడానికి సభ్యులు అంతగా ఇష్టపడని కాలమది. దాంతో ప్రత్యామ్నాయంగా కరీంనగర్ లో అందుబాటులో వున్న చిన్న చిన్న మీటింగ్ హాల్స్ ని మా ఫిలిం ప్రదర్శనలు వినియోగించుకునే ప్రయత్నం చేసాం. దానికి మాకు బాగా ఉపయోగపడింది ‘చలిమెడ జానకీ దేవి’ హాలు. తెరందాజ్ టాకీసుకు దగ్గరిలో రైతు బజార్ కు ముందున్న ఆ హాలు మా మీటింగులకు, 16ఎం.ఎం. సినిమాల ప్రదర్శనలకు ఎంతగానో అనువుగా వుండేది. దాని నిర్వాహకులు కూడా ఎప్పుడు అంటే అప్పుడు కఫిసో కి మామూలు ధరకే అద్దెకి ఇచ్చేవారు. దాంతో కఫిసో అధ్యక్షుడిగా వున్న ఎడమ నారాయణ రెడ్డి, కోలా రామచంద్రా రెడ్డి, రఘురాం, లక్ష్మణ్ కుమార్, రావికంటి మురళి, రేణికుంట రాములు ఇతరనిర్వాహక సభ్యులు నాకు ఎంతగానో సహకరించారు. ఫిలిం సొసైటీల సమాఖ్య నుండి అనేక దేశాల సినిమాలు అందుబాటు లోకి వచ్చేవి. దాంతో చాలా ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించి కఫిసోను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించాం. సభ్యులూ ఉత్సాహంగా వచ్చేవాళ్ళు.

కరీంనగర్ ఫిలిం సొసిటీ రజితోత్సవాల్లో భాగాగా 2002 జనవరిలో మొదట కొరియన్ చలన చిత్రోత్సవం ఏర్పాటుచేశాం. కొరియన్ సినిమాల గురించి చదవడమే కాని పెద్దగా ఆ దేశ సినిమాల్ని చూసె అవకాశం అప్పటిదాకా నాకు కూడా దొరకలేదు. మూడురోజుల చిత్రోత్సవంలో ‘గ్రేట్ ట్రాజెడి’, ‘చిల్ సూ అండ్ మాన్ సూ’, ‘ప్రైం రోజ్’ అన్న సినిమాల్ని ప్రదర్శించాం. జిల్లా పౌర సంభందాల శాఖ వారి ప్రొజెక్టర్, ఆపరేటర్ ల సహాయం తీసుకున్నాం.

కొరియన్ దేశ జీవన విధానాన్ని, అక్కడి సంస్కృతిన పట్ల ఆ ఫెస్టివల్ ద్వారా కొంత అవగాహన కలిగింది. మా సభ్యులు కూడా ఆసక్తిగా ఆ సినిమాల్ని చూసారు. మొదటి రోజు చిత్రోత్సవాన్ని అన్ని వేళలా మా కార్యక్రమాలకు సహకరిస్తున్న పౌర సంభందాల అధికారి కే.మార్కండేయగారితో లాంచనంగా ప్రారభించాం. ఫైల్మ్ సొసైటీ నిర్వహించే అన్ని 16 ఎం.ఎం, వీడియో ప్రదర్శనలు తమ శాఖ సహకరిస్తుందని ఆయన సభా ముఖంగా చెప్పారు. దాంతో స్కూళ్ళల్లో కాలేజేల్లో ప్రదర్శనలు వేయడానికి మాకెంతో ఉత్సాహం అవకాశం పెరిగింది. అప్పటికి ఇంకా ఎల్.సి.డి. ప్రొజెక్టర్ లాంటివి అందుబాటులోకి రాలేదు.

కఫిసో ప్రదర్శనలు ఇట్లా సాగుతూ వుండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం మన కార్యక్రమాలు కేవలం సభ్యులకే పరిమితం చేయకుండా వివిధ కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థులకు మంచి సినిమాల్ని అర్థ వంతమయిన సినిమాల్ని చూపించాలి అని ప్రతిపాదించాను. కార్యవర్గం ఎంతో ఉత్సాహంగా నన్ను సమర్థించింది. ఎందుకంటే ఏ పని అయినా ఒక్కడి తో కాదు. ఆలోచన పని ఒక్కడు చేసినా మిగతా అంతా సహకరిస్తినే సాధ్యమవుతుంది అన్నది నా అవగాహన. కాలేజీల్లోకి వెళ్ళాలన్న నా ఆలోచనకు మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ సామాజిక సేవా విభాగం ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చింది. ఆ కార్యక్రమానికి “వ్యూ అండ్ రివ్యూ’ (వీక్షించండి సమీక్షించండి) అని పేరు పెట్టాను. ఎన్.ఎస్.ఎస్. అధికారులు ఎంతగానో సహకరించారు. మొదటి కార్యక్రమంలో సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ‘టెర్రరిస్ట్’ సినిమాను విద్యార్థులకు కాలేజీ ఆడిటోరియం లో ప్రదర్శించి, ఆ సినిమా పైన సమీక్ష రాయమని కోరం. విద్యార్థులు బాగా స్పందించారు. ఉత్తమమయిన వాటికి కఫిసో బహుమతులు ఇచ్చింది. ఆ కార్యక్రమంలో అప్పటి జిల్లా ఎం.ఎస్.ఎస్. అధికారి డాక్టర్ కే.మురళి, క్యాంప్ కన్వీనర్ శ్రీ బి.రాజమౌళి మాతో పాలుపంచుకున్నారు.

ఆ తర్వాత “వ్యూ అండ్ రివ్యూ’ లో కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలను వేదికగా తీసుకున్నాం. అక్కడ ‘గాడ్ మదర్’ సినిమా వేశాము. ప్రిన్సిపాల్ శ్రీ టి.లక్ష్మణ్ రావు ‘వర్తమాన పురుషాధిఖ్య సమాజంలో స్త్రీలనూ వారి వ్యక్తిత్వాలనూ ఉన్నతీకరించే సినిమాలు రావాలని సూచిస్తూ విద్యార్థినులతో మాట్లాడారు. దర్శకుడు వినయ్ శుక్లా రూపొందించిన ‘గాడ్ మదర్’ లో షబానా ఆజ్మీ ముఖ్యాభినేత. మహిళా కళాశాల విద్యార్తినులు బాగా స్పందించారు. కఫిసో చేపట్టిన ఆ “వ్యూ అండ్ రివ్యూ’ కార్యక్రమం కళా శాలలకే పరిమితం చేయకుండా స్కూళ్ళల్లో కూడా కొంత కాలం నిర్వహించాం. ఆ కార్యక్రమం విజయవంతం కావడం వ్యక్తిగతంగా ఐడియా ఇచ్చిన నాకూ, నిర్వాహులుగా మా అందరికీ ఎంతో సంతోషాన్ని మిగిల్చింది.

ఇట్లా మేము నిర్వహించిన “వ్యూ అండ్ రివ్యూ’ లలో విద్యార్థులు రాసిన సమీక్షలు చదివిన తర్వాత వాళ్లకు మంచి సినిమాలు ప్రదర్శించడమే కాదు ఏవి మంచి సినిమాలు, మంచి సినిమాల్లో వుండే మౌలిక అంశాలేమిటి వాటిని ఎట్లా చూడాలి అన్న అంశాల్ని చెప్పాలనే ఆలోచన కలిగింది. అప్పటికే ఫిలిం అప్రిసియేషన్ కోర్సులు నిర్వహించిన అనుభవం వున్న కఫిసో స్కూలు పిల్లలకు, కాలేజీ పిల్లలకు అప్రిసియేషన్ కోర్సులు నిర్వహించాలనుకున్నాం. ప్రతి రెండు నెలలకొకసారి అప్రిసియేషన్ కోర్సులు నిర్వహించాలని నిర్ణయించాం. ఆత్మీయ మిత్రుడు శ్రీ అక్కినేని కుటుంబ రావు దర్శకత్వం లో వచ్చిన జాతీయ అవార్డు చిత్రం ‘పాత నగరంలో పసివాడు’ తో ఆ కోర్సును ప్రారంభించాం. మొదటి రోజు కోర్సు కు కుటుంబ రావు, ప్రసిద్ధ రచయిత్రి వోల్గా లు అతిథులుగా వచ్చారు. పిల్లలకు మంచి సినిమాలు ఏవి..వాటిని చూడడం ఎలా.. వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి లాంటి అనేక విషయాల్ని చాలా బాగా వివరించారు. ఆనాటి కార్యక్రమంలో నాకు గుర్తున్నంత వరకు వివేకానంద, తేజ స్కూలు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా అనేక స్కూల్స్ లో కాలేజీల్లో ఈ అప్రిసియేషన్ కోర్సులు నిర్వహించాం. అదొక గొప్ప అనుభవం. వీటిల్లో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభ ఉత్సాహాలు ఎన్నదగినవి. అవకాశాలు కల్పించాలే కాని వారిలో సృజనాత్మకత ఉప్పెన లా బయట పడుతుందన్నది మరోసారి నా అనుభవంలోకి వచ్చింది. దాని కోసం వ్యక్తులు, సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తే ఫలితాలు మరింత గొప్పగా వుంటాయి. స్టడీ కోర్సుల్లో కూడా అప్రిసియేషన్ కోర్సులు పెట్టాలని, క్యాంపస్ క్లబ్స్ పెట్టాలని నేను అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాను కాని ఎవరు వింటారు.. ప్రతిపాదన అట్లా పెండింగ్ ఫైల్స్ లో వుండిపోయింది.



ఆ తర్వాత శ్రీ బి.నరసింగ రావు చలన చిత్రోత్సవం నిర్వహించాం. తీరందాజ్ టాకీసులోఎర్పాటు చేసాం. నాలుగు రోజుల పాటు ఆ ఉత్సవం సాగింది. ఆ చిత్రోత్సవంలో ఫీచర్ ఫిలిమ్స్ ‘రంగుల కల’,‘దాసి’, ‘మట్టి మనుషులు’, డాక్యుమెంటరీలు ‘ఆకృతి’, ‘ది సిటీ’, ‘మావూరు’ లు ప్రదర్శించాం. వెండితెర పై చెరగని తెలంగాణా సంతకమయిన బి. నరసింగ రావు సినిమాల ఫెస్టివల్ కరీంనగర్ లో పెద్ద విజయవంతమయిన ఉత్సవంగా నిలిచింది. శ్రీ నరసింగ రావు వేములవాడ, సిరిసిల్లా, హుజురాబాద్ లాంటి అనేక ఫిలిం సొసైటీ లు ఇర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులకు మంచి ప్రోత్సాహాన్నిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన దాసి, సిటీ, మావూరు లు విశేషంగా మా కవిసో సభ్యులని ఆకట్టుకున్నాయి.

అదే ఏడు నవంబర్ లో ప్రతి సంవత్సరం లాగే బాలలకోసం చలన చిత్రోత్సవాన్ని నిర్వహించాం. ఆ నాటి ఉత్సవంలో నంది అవార్డుల్ని అందుకున్న ‘లిటిల్ సోల్జర్ల్స్’, ‘కుచ్చి కుచ్చి కూనమ్మ’, ‘బాల రామాయణం’ సినిమాల్ని వేశాము. కరీంనగర్ లోని అనేక స్కూల్స్ కు చెందిన బాలబాలికలు ఎంతో ఉత్సాహంగా ఒక పండుగలాగా అందులో పాల్గొన్నారు.
ఇక 2002 సంవత్సరం చివర డిసెంబర్ లో ‘భారతీయ చలన చిత్రోత్సవం’ ఏర్పాటు చేసాము.. దానికి అప్పటి జిల్లా కలెక్టర్ సుమితా దావ్రా చాలా సహకరించారు. వారం రోజుల పాటు మేము నిర్వహించిన ఈ ఫెస్టివల్ని కరీంనగర్ లోని మూడు టాకీసుల్లో ఏర్పాటు చేసాం. మమత, శివ, తీరందాజ్ హాళ్ళలో సినిమాలు ప్రదర్శించాం.నిర్వాహకులం వేర్వేరు టాకీసులకు బృందాలు బృందాలుగా విడిపోయి ప్రదర్శనల్ని పర్యవేక్షించాం. ఇక ఫెస్టివల్ ను మొదట మమత టాకీసులో కలెక్టర్ సుమితా దావ్రా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సామాజిక బాద్యత తో కళాత్మకంగా రూపొందిన సినిమాల్ని నేనే ఈ ఫెస్టివల్ కు ఎంపిక చేసాను. సేతుమాధవన్ దర్శకత్వం వహించిన ‘స్త్రీ’ ప్రారంభ చిత్రం కాగా శ్యాం బెనెగల్ “సూరజ్ కాసాత్వాఘోడా”, అమోల్ పాలేకర్ ‘ఖైరీ”, గోపీ దేసాయి “బస్ యుహీ రఖో”, శ్యాం బెనెగల్ ”హరీ భరీ”, రూప దత్తా నాయర్ “కభీతుం కభీ హం”, కల్పనా లాజ్మీ “దమన్” మొదలయిన సినిమాలు ఈ ఉత్సవం లో ప్రదర్శించాం. కఫిసో సభ్యుల తో పాటు అనేక మంది ఎంతో ఉత్సాహంగా సినిమాలకు పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే ఫిలిం ఫెస్టివల్స్ ఏమాత్రం తీసిపోనీ విధంగా ఈ ఉత్సవాన్ని కరీంనగర్ లో విజయవంతంగా నిర్వహించడం అప్పటి కఫిసో దీక్షకు పట్టుదలకు నిదర్శనం.అంతే కాదు ఆనాటి కార్యవర్గం చూపిన చొరవ అనితర సాధ్యం.

అట్లా 2002 సంవత్సరం కరీంనగర్ ఫిలిం సొసైటీ అనేక కార్యక్రామాలు నిర్వహించి దక్షిణ భారత దేశ ఫిలిం సొసైటీ సమాఖ్యలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక నా మట్టుకు నాకు వచ్చినా ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగాము అన్న సంతృప్తి మిగిలింది. వీక్షించండి-సమీక్షించండి అన్న కార్యక్రమం ద్వారా కళలు కాలేజీలకు చేరాలి యువకులు సాంస్కృతికంగా సామాజికంగా ఎదిగేలా తోడ్పడాలి అన్న భావనను కొంత మేర సాధించ గలిగాం. అంతే కాకుండా FILM APPRECIEATION COURSE FOR CHILDREN AND STUDENTS అన్నది కూడా విద్యార్థుల్ని అధ్యాపకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అట్లా
ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరిన తర్వాత అటు కాలేజీలోనూ ఇటు కఫిసో లోనూ ఇతోధికంగా పని చేసే అవకాశం వచ్చింది.

మిగతా వివరాలు మళ్ళీ వారం..

-వారాల ఆనంద్
1 జనవరి 2023

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

 

 

By admin