కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటించడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా 18 నెలల పదవీ కాలం ఉండగానే కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మునుగోడులో మూడు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ( #GameChanZer ) సంస్థ తాజాగా ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేదెవరు? అనే ప్రశ్నకు సమాధానంగా అత్యధికులు కాంగ్రెస్‌కే ఓటేశారు. ఏకంగా 54 శాతం మంది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. బీజేపీ గెలుస్తుందని 29 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ గెలుస్తుందని కేవలం 14 శాతం మంది నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక బీఎస్పీకి మూడు శాతం మద్దతు లభించింది.
నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. టీఆర్ఎస్ కూడా బలం పెంచుకునే అవకాశం ఉంది. కానీ తాజా పోల్ రిజల్ట్ చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ గెలుస్తుందని కేవలం 12 శాతం మంది నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఇందుకు ఉదాహరణ. కోమటిరెడ్డి అభ్యర్థిత్వానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి అదనపు బలాలని చెప్పొచ్చు. అందుకే తాజా పోల్ ఫలితాల్లో 29 శాతం మంది బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్‌కు మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.