తన రాజీనామాను ప్రకటించారు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా లేఖ త్వరలోనే స్పీకర్‌కు అందిస్తానని ప్రకటించడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. నిజానికి ఖాళీ అయిన స్థానానికి 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోంది. రాజీనామా ఆమోదంపై ఎన్నికల కమీషన్‌కు అసెంబ్లీ సమాచారం పంపితే ఖాళీని నోటిఫై చేసి పోలింగ్‌కు ఈసీ కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది నవంబర్ చివరలో హిమచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే మునుగోడులోనూ బైపోల్ జరిగే అవకాశం ఉంది. అక్టోబర్‌లో దీపావళి తరువాత ఇందుకు సంబంధించి షెడ్యూల్ రావొచ్చని తెలుస్తోంది. అంటే నవంబర్‌లోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రకంగా చూస్తే ఇప్పటి నుంచి వంద రోజుల సమయం ఉంటుందన్న మాట. మునుగోడులో గత ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు పర్వలేదు. బీజేపీకి ఇక్కడ పెద్దగా ఓటింగ్ లేదు. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి గెలిస్తానన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఆయన భరోసా పెట్టుకున్నట్టే కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిందనే నమ్మకం ప్రజల్లో కలిగింది. దీంతో తమ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలు తమను వరిస్తాయని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమ బతుకులు బాగుపడతాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరు ఓడినా గెలిచినా తమ నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుందో లేదో ఇక వేచి చూడాల్సి ఉంది.