ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై గేమ్ ఛేంజర్ సంస్థ ఓపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రజా వ్యతిరేకత ఉన్నా ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కమలం పార్టీనే అధికారం చేపడుతుందని ఈ పోల్‌లో తేలింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 292 నుంచి 312 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఈ పోల్ తెలిపింది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయెన్స్ 118 నుంచి 138 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పింది. ఇక థర్డ్ ఫ్రంట్ అంటోన్న టీఎంసీకి 27 నుంచి 31, వైఎస్సార్ సీపీకి 17 నుంచి 23. ఆమ్ ఆద్మీకి 8 నుంచి 12, టీఆర్‌ఎస్‌కు 6 నుంచి 10, ఇతరులకు 40 నుంచి 52 సీట్లు వస్తాయని గేమ్ ఛేంజర్ సర్వే తెలిపింది.
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారు ఎవరనే విషయంపై కూడా గేమ్ ఛేంజర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో రాహుల్ గాంధీ 22శాతంతో ముందు వరుసలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అరవింద్ కేజ్రీవాల్ 19శాతం, మమతా బెనర్జీ 13శాతం, ప్రియాంకా గాంధీ 11 శాతం, సీఎం కేసీఆర్ 4 శాతం, ఇతరులు 31 శాతం ఉన్నారు. కాగా కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ నిర్వహించిన తాజా ఓపీనియన్ పోల్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వెలువడడం కొసమెరుపు. ఈ సర్వేను జాతీయ స్థాయిలో నిర్వహించగా టీఆర్‌ఎస్ తెలంగాణలో మాత్రమే బలంగా ఉండడం కేసీఆర్ పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేశాయి. కాగా ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీ కేవలం 6 నుంచి 10 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని ఈ పోల్‌లో తేలింది. ఇక ప్రధాని పదవికి పోటీ విషయంలో కేసీఆర్ చాలా వెనకబడ్డారని కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి.