హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే ఆటా 17వ మహాసభలకు రావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది మహాసభలో పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ఈ సారి తెలంగాణ రాష్ట్ర పెవిలియన్‌ని ఏర్పాటు చేయనున్నట్లు.. అందులో మన ఊరు -మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం, వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వారు ఎమ్మెల్సీ కవితకు వివరించారు.
భవిష్యత్ తరాలకు మన బతుకమ్మ విశిష్టత గురించి తెలిపేందుకు బతుకమ్మ పై ఇంగ్లీష్‌లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల, శరత్ వేముల, జయంత్ చల్ల, వేణు సంకినేని తదితరులు ఉన్నారు.