ఫోర్బ్స్‌ జాబితాలో జగిత్యాల బిడ్డ
టాప్‌ 50 సీఐవోలలో రఘునందన్‌రావుకు స్థానం

జగిత్యాల: అమెరికన్‌ బిజినెస్‌ మాగజైన్‌ ఫోర్బ్స్‌ జాబితాలో జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలానికి చెందిన సాగి రఘునందన్‌రావు చోటు దక్కించుకొన్నారు. 2022 సంవత్సరానికి టాప్‌ 50 సీఐవోల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకొన్నారు. రఘునందన్‌రావు కుటుంబం ఉద్యోగరీత్యా కరీంనగర్‌లో స్థిరపడింది. తండ్రి సంజీవరావు ప్రభుత్వ పశువైద్యునిగా రిటైరయ్యారు. తల్లి పుష్పలత గృహిణి. కుమారుడికి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన సంజీవరావు మరింత ప్రోత్సహించారు. ఇంజినీరింగ్‌ తర్వాత ఉన్నత చదువుల కోసం రఘునందన్‌రావు అమెరికా వెళ్లారు. ఓ వైపు చదువుతూనే, పలు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. వాటిని విజయతీరాలకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మెటిక్‌ సంస్థ సెఫోరాలో చీఫ్‌ ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌ (సీఐవో)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇన్స్‌పైర్‌ బ్రాండ్స్‌లో సీఐవోగా ఉన్నారు. రఘు బాధ్యతలు చేపట్టిన 2019 నుంచి సంస్థ డిజిటల్‌ అమ్మకాలు రెండింతలు పెరిగి 1.5 బిలియన్లకు చేరినట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. సామాన్య కుటుంబంలో జన్మించిన రఘు స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఫోర్బ్స్‌ జాబితాలో రఘుకు స్థానం దక్కడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు హర్షం ప్రకటించారు.

By admin