తీన్మార్‌ మల్లన్న గురించి తెలియనివారు లేరు. క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ఉదయాన్నే పేపర్ రీడింగ్ చేస్తూ అందర్నీ పలకరిస్తుంటారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం తీన్మార్‌ మల్లన్నకు దినచర్య. కేసీఆర్ ను విమర్శిస్తూ మల్లన్న వాడే పదజాలం అభ్యంతరకరంగా ఉందని పలువురు విమర్శించినా ఇన్నాళ్లూ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పైగా తన విమర్శలకు మరింత పదును పెడుతూ కేసీఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీని చివరకు సీఎం మనవడిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదురించడంతో ఓ సారి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత బీజేపీలో చేరిన మల్లన్న కొంత కాలంగా ఆ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇక బీజేపీ ఆఫీసు గడప తొక్కనని ఈ మధ్య జరిగిన 7200 మూవ్‌మెంట్ సభలో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

సొంతంగా రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్న తీన్మార్‌ మల్లన్న 7200 మూవ్‌మెంట్ ద్వారా ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. జూన్‌ 2 నుంచి పాదయాత్రకు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసంది. ఇక నుంచి కేసీఆర్ ను తాను తిట్టబోనని ఒట్టేశారు మల్లన్న. మంత్రులపై కూడా విమర్శలు చేయనన్నారు. కేసీఆర్ ను, ఆయన కేబినెట్ మంత్రులను తిట్టడం తన విధానం కాదన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడానికే తన ప్రయత్నమన్నారు. విద్యాశాఖను బాల్కసుమన్, గాదరి కిషోర్‌ వంటి విద్యావంతులకు అప్పగిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తంచేశారు మల్లన్న. పేదేళ్లు, పెద్దోళ్లనే తేడా లేకుండా అందరూ ఒక్కచోట చదువుకోవాలనేదే తన అభిమతమన్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు తన ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిస్తానన్నారు. రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి వస్తే బాగుంటుందన్నారు.

అటు కేసీఆర్ ను తిట్టనని చెబుతూనే పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు తీన్మార్‌ మల్లన్న. రాష్ట్రమంతా రైతులు ఆగమైతుంటే.. సీఎం మాత్రం ఫామ్‌హౌజ్ దాటి బయటకు రావడం లేదన్నారు. కోట్లు ఖర్చుపెట్టి కట్టిన యాదాద్రి అభివృద్ధి ఒక్క గాలివానకే తేలిపోయందన్నారు. మొత్తంగా మల్లన్న తీసుకున్న నిర్ణయం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. మరి మల్లన్న ఒట్టుకు కట్టుబడి ఉంటాడో… మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేస్తారో కాలమే తేలుస్తుంది.

By admin