• సినిమా పేరు: ‘లాట్స్ ఆఫ్ లవ్’
  • విడుదల తేదీ: 30-09-2022
  • నటీనటులు: డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన తదితరులు
  • సంగీతం: విశ్వ
  • ఎడిటర్స్: శ్రీనివాస్, నాగిరెడ్డి
  • సినిమాటోగ్రఫీ: మురళీ, నగేష్, కుమార్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బీకే కిరణ్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం: డా. విశ్వానంద్ పటార్

టాలీవుడ్ స్క్రీన్‌పై మ‌రో ప్రేమ క‌థ ఆవిష్కృతమైంది. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ రూపొందిన మూవీ ‘లాట్స్ ఆఫ్ లవ్’. యూత్ ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తే హిట్టు ప‌క్కా అనే క‌న్సెప్టులో తెర‌కెక్కిన‌ ‘లాట్స్ ఆఫ్ లవ్’ సినిమా ప్రేక్ష‌కులు ముందుకొచ్చింది. ఇంత‌కీ ఈ సినిమాలో ఉన్న‌ లాట్స్ ఆఫ్ లవ్ ఏంటీ? యూత్‌ను ఆక‌ట్టుకుంటుందా? లేదా? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

స్టోరీ:
ఓ డాక్ట‌ర్ – టీచ‌ర్ మ‌ధ్య సాగే క‌థ‌నమే ఈ సినిమా. కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు అల్లాడిపోతుంటే చూసి తట్టుకోలేక వారి కోసం ఏమైనా చేయాలని తపించే డాక్టర్.. మనోహర్ (విశ్వానంద్ పటార్). కానీ తను అనుకున్న పనిని చేయడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. నామమాత్రపు ఫీజుతో చికిత్స చేస్తూ.. జనాలకు సేవ చేసే మనోహర్ అప్పులలో కూరుకుపోతాడు. మరి అతని తపన ఎలా తీరింది? అతనికి, స్కూల్ టీచర్ సరిత (ఆద్య)కు మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్లింది?. కాలేజ్‌కు బస్సులో వెళుతున్న రాకేష్ (నిహాంత్).. అదే బస్సులో నిలబడి ఉన్న మనోజ(దివ్య)కు సీటిచ్చి.. ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. కానీ వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు. అందుకు కారణం ఏమిటి? ఒక అనాథ అయిన రాజు (రాజేష్) ఎంతో కష్టపడి.. పెద్ద పేరున్న కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. అతని సక్సెస్‌కు కారణమైన రజిని (భావన)ను ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ రజినీ ఫ్యామిలీ రాజు అనాథ అని పెళ్లికి ఒప్పుకోరు. మరి వారి పెళ్లి ఎలా జరిగింది? అసలతను అనాథ ఎలా అయ్యాడు? ప్రస్తుత ప్రపంచ తీరు గురించి, దేవుడి గురించి తత్వం బోధించే స్వామిజీ (కిరణ్)కి, ఎవరు కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ చేయూతనందించే ఎన్‌జిఓ సంయుక్త (మాధవి)కి ఉన్న సంబంధం ఏమిటి?

పైన చెప్పుకున్న నాలుగు కథలకు.. డబ్బుతో, రౌడీయిజంతో.. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పొగరబోతు జమీందారు (తెనాలి పంతులు), అతని కొడుకులకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘లాట్స్ ఆఫ్ లవ్’ సినిమా.

అనాల‌సిస్:
ఈ సినిమా నాలుగైదు కథల సమాహారం. మొద‌ట్లో కాస్త‌ స్లోగా నడిచిన ఈ సినిమా.. క్ర‌మంగా ఆసక్తిరేపుతూ నడుస్తుంది. జమీందారు ఫ్యామిలీకి పై కథలను లింక్ చేసిన విధానం, చివరికి ఆ జమీందార్ మారిపోయిన విధానంతో ఒక మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. నిజానికి అది ఈ ప్రపంచంలో జరుగుతున్నదే. సాటి వారికి సాయం చేయని వాడు, దేవుడిని కూడా లెక్క చేయకుండా దూషించేవాడు.. చివరికి అన్నీ పోగొట్టుకుంటాడనే మెసేజ్.. డబ్బున్న ధనవంతులకు ఇచ్చినట్లుగా ఉంది. స్వామిజీతో చెప్పించిన ‘పైకి ఎన్ని కారణాలు ఉన్నా.. చివరికి గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యం. మన జీవితంలో ఎప్పుడూ మన గమ్యాన్ని, గమ్యస్థానాన్ని గుర్తించుకుంటూనే ఉండాలి’, ‘వృత్తి ధర్మంతో పాటు స్వధర్మం కూడా పాటించాలి’, ‘యవ్వనం వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండి.. వారి అభిప్రాయాల్సి మన్నించాలి. అప్పుడే పిల్లలు గౌరవిస్తారు. వారిని లాలించాలి తప్ప.. శాసించకూడదు’ వంటి డైలాగులు ఆలోచనను రేకెత్తిస్తాయి. అలాగే డాక్టర్‌గా మనోహర్ ‘విద్య, వైద్యం సరైన దిశలో అందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకు టీచర్, డాక్టర్ మార్గదర్శనం చేయాలి’ అంటూ సమాజం బాగుండాలంటే ఏం చేయాలో చెప్పిన తీరు.. ‘సెల్ఫ్ లవ్, ఫ్యామిలీ లవ్, రొమాంటిక్ లవ్, ఫ్రెండ్షిప్ లవ్, డివైన్ లవ్, ప్రొఫెషనల్ లవ్’ అంటూ.. వాటి అర్థాన్ని వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా మెడికల్ మాఫియా బయట ఎలా ఉందో కూడా ఈ సినిమాలో చూపించారు. ఇంకా జమీందార్ యాదగిరి మారిన తీరు కూడా ఒక గుణపాఠంలా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడా లాజిక్ లేని కొన్ని సీన్లు, ఫస్టాఫ్‌లో కథ నడిచిన విధానం, అలాగే నటీనటులంతా కొత్తవారు కావడం కూడా.. ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్‌కి గురి చేస్తాయి. ఎమోషన్స్ పండించే సీన్లను ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించాల్సింది.

ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం వంటి బాధ్యతలన్నింటినీ ఒక్కడే నిర్వర్తించడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయమే. భారీ క్యాస్టింగ్‌ని ఆయన సమకూర్చుకున్న తీరు, పైన చెప్పుకున్న నాలుగైదు కథలను మిక్స్ చేసిన తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది.

ఆర్టిస్టుల ప‌ర్మార్మెన్స్:
ఈ సినిమాలో మెయిన్ పాత్రను చేయడమే కాకుండా.. సినిమాకు సంబంధించి పలు బాధ్యతలను దర్శకుడు విశ్వానంద్ పటార్ పోషించారు. కరోనా రోగులకు సేవ చేయాలనే తపన కలిగిన డాక్టర్‌గా, తల్లి కోరికను తీర్చాలనుకునే కొడుకుగా, ప్రేమికుడిగా.. ఇలా వైవిధ్యభరితంగా ఉండే మనోహర్ పాత్రలో విశ్వానంద్ ఆకట్టుకుంటాడు. ఆయన ప్రియురాలిగా చేసిన సరిత.. కాలేజ్ స్టూడెంట్స్‌గా చేసిన నిహాంత్, దివ్య.. అనాథగా చేసిన రాజేష్, అతనికి సపోర్ట్‌గా చేసిన భావన వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వీరితో పాటు NGOగా చేసిన మాధవి, స్వామిజీ పాత్రలో కిరణ్ హుందాగా కనిపించారు. ఇక విలన్‌గా జమీందార్ పాత్రలో చేసిన తెనాలి పంతులు, ఆయన కొడుకులుగా చేసిన ప్రవీణ్, శ్రీను, రాఘవేంద్రలు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. మంచి పాత్రలు పడితే.. విలన్లుగా వారు కొంతకాలం అలరించే అవకాశం ఉంది. ఇంకా మిగతా పాత్రలలో నటించిన వారు కూడా ఓకే. సాంకేతికంగా.. సినిమాకు తగినట్లుగా సంగీతం, ఎడిటింగ్, కెమెరా వర్క్ ఉంది. డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. రెండు పాటలు బాగున్నాయి. దర్శకుడు విశ్వానంద్ పటార్.. ఆయన నటించడమే కాకుండా.. భారీ తారాగణంతో.. ఓ నాలుగైదు కథలను మిక్స్ చేసి.. అందులోనూ ఓ మెసేజ్‌ని చొప్పించి.. తన మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. ఓవరాల్‌గా అయితే.. ప్రేమ పేరుతో ఓ మంచి మెసేజ్ అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు ఇస్తుంది.

ట్యాగ్‌లైన్: ప్రేమతో వినిపిస్తోన్న‌ గుండె చ‌ప్పుళ్లు

రేటింగ్: 3.25 / 5

 

By admin