‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్’’.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో హీరోల పాత్రల గురించి అజయ్‌దేవగణ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడిదే డైలాగ్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఎందుకంటే వివిధ భాషలు, ప్రాంతాలు, దేశాలకు చెందిన నటీనటులందరూ ‘ఆర్ఆర్ఆర్’ అనే మహాసంగ్రామంలో ఒక్కో ఆయుధంగా మారారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకోవడంలో ఆయా నటులు కీలకపాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ అంటే కేవలం రామ్‌చరణ్-తారక్-రాజమౌళి మాత్రమే కాకుండా.. ఇంకా ఎంతోమంది నటీనటులు ఉన్నారు.
బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ ఈ సినిమాతోనే తెలుగువారికి పరిచయమయ్యాడు. ఇందులో ఆయన పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ‘‘నేనంటేనే ఓ పోరాటం’’ అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యా బిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన పోరాటయోధుడిగా అజయ్‌దేవగణ్ కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర కొంత సమయమే ఉన్నప్పటికీ.. ఆ రోల్ ప్రేక్షకుల్లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అజయ్‌దేవగణ్ రోల్ ప్రేక్షకుల కంటనీరు తెప్పించేలా ఉంది. ఇంతటి పవర్‌ఫుల్ స్టోరీలో భాగమైనందుకు ఆనందించిన అజయ్.. ఈ సినిమా కోసం వర్క్ చేసినందుకు పారితోషికం కూడా తీసుకోలేదట.
ఇక శ్రియ. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోనే శ్రియ నటించింది. ఇందులో ఆమె అజయ్‌దేవగణ్ సతీమణిగా సరోజిని పాత్రలో కనిపించింది. బరువైన గుండెతో కుటుంబాన్ని వదిలి.. భర్త అడుగుజాడల్లో పోరాట మైదానంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె కనిపిస్తుంది. శ్రియ పాత్ర ఎంతో భావోద్వేగాలతో రూపుదిద్దుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె పండించిన హావభావాలు ప్రేక్షకుల హృదయాల్ని ద్రవింపచేసేలా ఉన్నాయి. మరో కీలక పాత్రలో రాజీవ్ కనకాల నటించాడు. ఎన్టీఆర్ బెబ్బులిగా పేరు తెచ్చుకున్న భీమ్ పాత్రలో నటించగా, భీమ్ గొప్ప తనం గురించి బ్రిటీష్ వాళ్లకు రాజీవ్ వివరించే సన్నివేశాలు రోమాలు నిక్క బొడుచుకునేలా ఉంటాయి.
ఈ పాన్ ఇండియా సినిమాలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు. అలా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన వారిలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ఒకరు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ రోల్‌లో రామ్‌చరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా నటించాడు. బ్రిటీష్ వారిపై యుద్ధం చేయడానికి రామ్‌చరణ్ సిద్ధమవుతుండగా.. ‘‘చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయ్ రా’’ అంటూ ఆయన భావోద్వేగంతో చెప్పే సంభాషణలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో తారక్‌కు లవ్ లేడీగా కనిపిస్తుంది విదేశీ భామ ఒలీవియా మోరీస్. కొన్ని సీన్‌లలోనే స్క్రీన్‌పై తళుక్కున మెరిసి.. అలరిస్తుంది. ఇక ఇందులో నాయకులకు ధీటుగా ప్రతినాయకురాలి పాత్ర ఉంటుంది. ఎంతో క్రూరత్వంతో కూడుకున్న ఈ పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించింది. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగువారికి పరిచయం చేసింది. ఇక టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈసినిమాలో కీలకపాత్ర చేశాడు.