సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తే ఈ జోనర్ లో సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. ఆ విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి అలరించడానికి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘డైరెక్టర్’. నాటకం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న ఆశిష్ గాంధీ హీరోగా నటించాడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై డా.నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఓ కీలకపాత్ర చేశారు. దర్శక ద్వయం కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.
కథ:
‘డి’ అనే ప్రధాన పాత్రలో ఆశిష్ గాంధీ నటించాడు. ఇతడు ఒక సినిమా డైరెక్టర్. తనకు దొరికిన వారికి తను రాసుకున్న కథలు చెబుతుంటాడు. అతనికి అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది. అతని జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది. యాక్సిడెంట్‌కి ముందు, యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది? ఎవరూ చూడని వాటిని అతను ఎలా చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు అనే విషయాలపై కథ నడుస్తుంది.
డైరెక్టర్ పాత్రలో నటించిన ఆశిష్ గాంధీ తన పాత్రకు న్యాయం చేశాడు. కావ్య పాత్రలో నటించిన ఐశ్వర్య రాజ్ భకుని, స్నేహ పాత్రలో నటించిన అంతర రౌత్, రమ్య పాత్రలో నటించిన మైరీనా సింగ్.. తమతమ పాత్రల్లో నటించి మెప్పించారు. జబర్దస్తు అప్పారావు, కార్తీక్, ఆర్.కె. ఇతర పాత్రల్లో నటించారు. నేను చూడగలను మీరు చూడలేరు.. అంటూ ఈ డైరెక్టర్ చెప్పే ఆసక్తిర డైలాగ్‌లతో ఈ సినిమా కథనం సస్పెన్స్‌గా సాగుతుంది. ఈ సినిమాను ఇద్దరు డైరెక్టర్‌లు తెరకెక్కించారు. డైరెక్టర్‌లు కిరణ్ పొన్నాడ – కార్తీక్ కృష్ణ ఈ సినిమాను విభిన్నంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఒక వినూత్న ప్రయోగాన్ని చేసారు దర్శక ద్వయం. ఫస్టాఫ్‌లో కాస్త కామెడీగా సాగినా సెకండాఫ్‌లో సినిమాపై సస్పెన్స్ మరింతా పెరుగుతుంది. అనేక ట్విస్టులతో సినిమా సాగుతుంది. ఊహించని మలుపులతో ప్రేక్షకుడిని థ్రిల్లుకు గురిచేస్తుంది ఈ సినిమా.
రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. బి.నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ పరవాలేదు. సినిమాటోగ్రఫీ ఆదిత్య వర్దిన్ పనితీరు బాగుంది. ప్రతి విజువల్ అందంగా, నీట్‌గా కనిపిస్తుంది.
ఫైనల్‌గా… ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్టు “నేను చూడగలను మీరు చూడలేరు”. కానీ సినిమా మాత్రం అన్ని తరహా ప్రేక్షకులు చూడొచ్చు.
రేటింగ్ 3/5