శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరానికి అసని తుపానులో కొట్టొకొచ్చిన బంగారు రథం మిస్టరీ దాదాపు వీడిపోయింది. బంగారు రంగుతో మెరిసిపోతున్న ఈ స్వర్ణ రథాన్ని స్థానికులు తాళ్లతో లాగి ఒడ్డుకు చేర్చారు. దేవుని ఊరేగింపులో ఉపయోగించే వాహనం మాదిరిగా అది కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుకు సముద్రంలో కొట్టుకు వచ్చిన ఆ వింత వాహనం బంగారు రంగుతో మెరిసిపోతోంది. దాన్ని నిజంగా బంగారు రథమే అని స్థానికులు కొందరు భావించారు. దాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాంతో పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
ఈ బంగారు రథం మయన్మార్ నుంచి కొట్టుకువచ్చినట్టు క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. మయన్మార్ లో సన్యాసం తీసుకునే యువతీ యువకులను ప్రత్యేకంగా తయారుచేసిన వాహనాల్లో భారీ ఎత్తున ఊరేగిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకు వచ్చిన మాహనం కూడా అలాగే కనిపిస్తోందని అధికారులు చెప్పారు. అయితే.. ఈ వాహనం పెద్దగా కనిపిస్తోందన్నారు. ఊరేగింపు తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారని, అది పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో తుపాను తీవ్రతకు ఇలా కొట్టుకుని వచ్చి ఉంటుందంటున్నారు. ఈ వాహనంపై ఈ ఏడాది జనవరి 16 తేదీ ఉండడంతో నాలుగు నెలల క్రితమే దీన్ని తయారుచేసి ఉంటారని, అందుకే కొత్తగా ధగధగలాడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ బంగారు రథం రూపురేఖలు, డిజైన్లు అన్నీ కూడా బౌద్ధమతం ధీమ్ లో ఉందని వారు అన్నారు. కాగా.. మూడు నెలల క్రితమే నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి ఇలాంటి వాహనం ఒకటి కొట్టుకొచ్చింది. అయితే.. అది చాలా పాతగా కనిపించింది. ఆ వాహనంలో బుద్ధుని ప్రతిమ, చిత్రంతో, శివలింగం కూడా ఉన్నాయి.
రథంపైన భాషను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా అది మయన్మార్ దేశానికి చెందిందని, ఇది బంగారు రథం కాదని తెలిపారు. రెండేళ్ల కిందట ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతానికి ఇలాంటి రథమే ఒకటి కొట్టుకొచ్చిందని, అప్పట్లో అది శ్రీలంక దేశానికి చెందిందిగా గుర్తించారు. ఇదిలా ఉండగా దీన్ని మందిరంగా వినియోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలని ఎం.సున్నాపల్లి మత్స్యకారులు అధికారులను అభ్యర్థిస్తున్నారు.