విడుదల తేదీ: 14-10-2022
నటీనటులు: అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధికా శర్మ, సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, మధు నందన్, గగన్ విహారి తదితరులు
బ్యానర్స్: ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్
సంగీతం: నవనీత్
కెమెరా: ప్రసాద్ ఈదర, సురేష్ గొంట్ల
ఎడిటర్: అనకాల లోకేష్
నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వైకుంఠ బోను
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటించిన చిత్రం నిన్నే పెళ్లాడతా. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్ గా నటించింది. వైకుంఠ బోను దర్శకత్వంలో ఈశ్వరీ ఆర్ట్స్, అంబికా ఆర్ట్స్ బ్యానర్లపై వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14 న(శుక్రవారం) గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
స్టోరీ…
వైజాగ్‌లో మెడిసిన్ చదువుతున్న ప్రియ (సిద్ధికా శర్మ) కోసం.. అదే కాలేజీలో చదువుతున్న అభిరామ్(అమన్).. తన డిగ్రీ మానేసి మరీ మెడిసిన్‌లో చేరతాడు. తన వెంటపడుతున్న అభిరామ్‌ని ప్రియ అసహ్యించుకుంటూ ఉంటుంది. కానీ.. అదే కాలేజీలో చదివే కిరణ్ అనే విద్యార్థి కారణంగా జరిగిన కొన్ని సంఘటనలతో అభిరామ్, ప్రియ ఇద్దరూ ప్రేమించుకుంటారు.. కానీ చెప్పుకోరు. ప్రియ తన ప్రేమ గురించి అభిరామ్‌కి చెప్పే సమయంలో.. అభిరామ్‌కి తండ్రి ధనుంజయ్(సాయికుమార్) నుండి ఫోన్ వస్తుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నీ ప్రేమని వదిలేసి వెంటనే ఊరు వచ్చేయాలని అభిరామ్‌కి తన తండ్రి చెప్పడంతో.. ప్రేమిస్తున్నానని ప్రియ చెప్పినా.. పట్టించుకోకుండా అభిరామ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత అభిరామ్‌ని, ప్రియని చంపాలని ధనుంజయ్ ప్లాన్ చేస్తాడు. అసలు ధనుంజయ్ వాళ్లని ఎందుకు చంపాలని అనుకుంటాడు? ధనుంజయ్ బారి నుండి వారిద్దరూ ఎలా తప్పించుకున్నారు? సరోజిని(ఇంద్రజ) ఎవరు? సరోజినికి, ధనుంజయ్‌కి ఉన్న సంబంధం ఏమిటి? ఆ బంధం అభి, ప్రియల ప్రేమకు ఎలా అడ్డుపడింది? చివరికి అభి, ప్రియలు ఒక్కటయ్యారా? వంటి ప్రశ్నలకు సమాధానమే.. ‘నిన్నే పెళ్లాడతా’ కథ .
విశ్లేషణ…
సినిమాకి ‘నిన్నే పెళ్లాడతా’ అనే టైటిల్ పెట్టడం సరిగ్గా సూటయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్ర క్లైమాక్స్‌కు సంబంధించిన లింక్‌ని ఈ చిత్ర క్లైమాక్స్‌కి కలిపిన తీరు.. టైటిల్‌కి జస్టిఫికేషన్‌గా నిలుస్తుంది. ఫస్టాఫ్ అంతా మెడికల్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, ప్రేమ కథతో నడిపి.. సెకండాఫ్‌లో ఆ ప్రేమకథని ఫ్యామిలీలతో లింక్ చేశారు. దర్శకుడు వైకుంఠ బోను తను అనుకున్న కథని పర్ఫెక్ట్‌గా చిత్రీకరించాడు. సెకండాఫ్‌లో రెండు, మూడు ట్విస్ట్‌లను కూడా యాడ్ చేసి.. ప్రేక్షకులకు ఇంట్రస్ట్ కలిగించాడు. అలాగే సీనియర్ నటీనటులను ఈ సినిమాలో ఆయన భాగం చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. అయితే ఇంద్రజ, సిజ్జుల పెళ్లి ఎపిసోడ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని తలపిస్తుంది. అలాగే సాయికుమార్‌తో ఇంద్రజకు సంబంధించిన ఎపిసోడ్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. సాయికుమార్ పాత్రని కూడా సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. అయితే సీత ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సాయికుమార్ కనిపించే ఫస్ట్ సన్నివేశం.. ఆయన పరువు కోసం పాకులాడే తీరు.. అతనికి కుమారుడు ఇచ్చే జ్ఞానోపదేశం.. దర్శకుడిలోని ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుంది.
‘‘దేవుడికే లేని కులం మనకెందుకు? భార్యను ఎత్తికెళ్లిన వాడిన చంపితే రామాయణం అన్నారు. వందమంది మధ్య చీర లాగిన వాడిని చంపితే భారతం అన్నారు. మరి కులం కోసం చంపుకుంటే ఏమంటారు? సాటి మనుషులను చంపమని ఏ కులం చెప్పింది? ఏ మతం చెప్పింది?.. మనిషి మనిషికే పుడతాడు.. చంపాల్సింది మనిషిని కాదు.. మనిషిలోని అహాన్ని. కులం ఒక పూట బువ్వ పెట్టలేదు.. ఒక మనిషి ప్రాణం కాపాడలేదు. జంతువే తన తోటి జంతువును చంపుకోదు’’.. వంటి డైలాగ్స్ నేడు కులం, పరువు వంటి వాటి కోసం కొట్లాడుకుంటున్న, చంపుకుంటున్న వారికి చెంపపెట్టులా ఉన్నాయి. ఈ సినిమాతో ‘పగలు, ప్రతీకారాలు వదిలేసి మనుషులుగా బ్రతకండి’ అని చెప్పడమే దర్శకుడి ఉద్దేశ్యం. అందుకోసం ఓ ప్రేమకథని తీసుకుని.. ఆ ప్రేమకథని రెండు కుటుంబాలకు కనెక్ట్ చేసి.. ఆ కుటుంబాలకు ఇంటర్ క్యాస్ట్ కనెక్ట్ చేసి.. ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ సినిమాని చిత్రీకరించారు. ఓవరాల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్నది మాత్రం పర్పెక్ట్‌గా చెప్పాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలు మరీ ల్యాగ్ అనిపించాయి. ఫస్టాఫ్‌లో కిరణ్‌తో గొడవ పడే ఎపిసోడ్స్ రిపీట్ చేయకుండా.. ఇంకాస్త వెరైటీగా ట్రై చేయాల్సింది. అలాగే సెకండాఫ్‌లో సాయికుమార్‌కి ఇంకాస్త స్కోప్ ఇస్తే బాగుండేది. ఫ్యామిలీ డ్రామా బాగా పండేది.
నటీనటుల పనితీరు:
రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడే అయినా.. అమన్ చాలా కష్టపడ్డాడు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ అన్ని బాగున్నాయి. కాకపోతే భారీ శరీరంతో ఓ యాక్షన్ హీరోలా కనిపించాడు. టైటిల్ చూసి ఇది ప్రేమకథ అనుకుని థియేటర్‌కి వెళ్లిన వాళ్లకి ప్రేమకథతో పాటు యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ కూడా కలుగుతుందంటే.. అందుకు కారణం అతని బాడీనే. అతనికిది రెండో చిత్రమే అంటే ఆశ్చర్యపోతారు. చాలా అనుభవం ఉన్న హీరోలా కనిపించాడు. ‘పైసా’లో క్యూట్‌క్యూట్‌గా కనిపించిన సిద్ధికా.. ఈ సినిమాలో కాస్త పరిణితి కలిగిన అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె పలికే డైలాగ్స్ కుర్రాళ్లతో విజిల్స్ వేయిస్తాయి.. అలాగే గ్లామర్ విషయంలోనూ ఆమె వెనక్కి తగ్గలేదు. సాయికుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఆయనకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ధనుంజయ్‌గా సాయికుమార్ పాత్రని ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించే అవకాశం ఉన్నా.. సింపుల్‌గానే లాగించేశారు. సాయికుమార్ భార్యగా నటించిన సీతకి ఎక్కువ సీన్లు లేవు కానీ.. కథలో ఆమె ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అన్నపూర్ణమ్మ పాత్రకి కూడా పెద్దగా స్కోప్ లేదు. ఇంద్రజకు కూడా రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇంకా కిరణ్‌గా నటించిన నటుడు, గగన్ విహారి, సిజ్జు, మధునందన్, చిత్ర నిర్మాత బొల్లినేని రాజశేఖర్ చౌదరి వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.
టెక్నికల్ టీమ్..
ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. పాటలు, వాటి చిత్రీకరణ ఓకే. ఎడిటింగ్ పరంగా ఫస్టాప్‌లో కాస్త ల్యాగ్ అనిపించింది. చూస్తున్న సీన్‌నే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు అనిపించింది. వాటిపై ఎడిటర్ ఓ లుక్ వేయాల్సింది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులంతా తమ పనితనం ప్రదర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. ప్రేమపై ఇంకా కులాలు, మతాల ప్రభావం ఉందని, వాటిని వదిలేసి అందరూ మనుషులమే అని చెప్పడానికి దర్శకుడు వైకుంఠ బోను ఎన్నుకున్న ఈ సబ్జెక్ట్.. చూస్తున్న ప్రేక్షకులతో వావ్ అనిపించదు కానీ.. ఒక్కసారి అలా ఆలోచించే ప్రయత్నాన్ని అయితే చేయిస్తుంది. ఈ సినిమాకి పెట్టిన టైటిల్ కూడా ప్లస్. మొత్తంగా చూస్తే.. ఆ ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో పోల్చలేం కానీ.. ‘మనం మనుషులం.. పగలు, పంతాలు మానేసి మనుషులుగా ఉందాం’ అనే దర్శకుడి థియరీ కోసం ఒకసారైతే ఈ సినిమాని కచ్చితంగా చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: మనుషులను ప్రేమించే సినిమా
రేటింగ్: 3.25 / 5