నిజంగా ఇదొ సినిమా కాదు ప్ర‌ణ‌య జంఝామారుతం..
ఇటు ప్రియుడు ప్రియురాలి మ‌ధ్య మాత్ర‌మే సాగే గాఢ ప‌రిష్వంగమే కాదు..
అటు ప్రేక్ష‌కుడినీ త‌న కొంగుకు ముడి వేసుకుని వెంట తిప్ప‌గ‌లిగిన క‌థానుబంధం..

మ‌ణిర‌త్నం త‌ర్వాత ఆ రేంజ్ లో ఒక క‌ల్ట్ క్లాసిక్ ను అందించ‌గ‌లిగిన ద‌ర్శ‌కులు మ‌న ద‌గ్గ‌ర ఉన్నారా? అన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేసిన చిత్రం సీతారామం.
త‌న అంత‌రాళాల‌లో ఎన్నాళ్ల నుంచో గూడు క‌ట్టుక‌ని ఉన్న ఒక క‌థ‌ను
ఇన్నాళ్ల‌కు వెలుగులోకి తెచ్చి.. దాన్నొక సీతాకోక చిలుక‌లా తెరపైకి వ‌దిలాడు ద‌ర్శ‌కుడు
ఈ ద‌ర్శ‌కుడిలో ఇంత పొయిట్రీ ఉంద‌ని..
ఇత‌డిలో ఇంత‌ క‌థా ఆర్ధ్ర‌త‌, దాని అంచుల‌కు ఇంతటి క‌ళాత్మ‌క‌త ఉంద‌ని ఇన్నాళ్ల పాటు గుర్తించ‌లేక పోయాం.. కానీ ఇప్పుడు తాను చెప్ప‌ద‌లుచుకున్న క‌థ‌ను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ట్టుగా నేరుగా ప్రెజంట్ చేయ‌గ‌లిగాడు.. హ‌ను..
ఈ మ‌ధ్య కాలంలో విరాట ప‌ర్వం త‌ర్వాత ఒక ద‌ర్శ‌కుడు ఫ్రేము ఫ్రేమూ చెక్కిన చిత్ర‌మిదే ..
కాకుంటే అది న‌క్స‌లిజంలోని కాఠిన్యాన్ని ఎత్తి చూపితే..
ఇది మిల‌ట‌రీ బేస్ క్యాంపుల్లోని క‌ఠోర వాస్త‌వాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టింది..
ఒక సైనికుడి తుపాకీ త‌న ప్ర‌త్య‌ర్ధుల గుండెల‌ను నేరుగా గురి పెట్టాలి కానీ..త‌న గుండెల వెన‌క ఆర్ద్ర‌త ఉండ‌కూడ‌ద‌ని నిరూపించిన చిత్రం సీతారామం
నిజానికి త‌న స‌హృద‌య‌త త‌న‌కో సారి సీత‌ను ప‌రిచ‌యం చేస్తే..
ఆ త‌ర్వాత అత‌డెలాగో దాన్ని ప్ర‌ణ‌యం నుంచి ప‌రిణ‌యంగా మార్చేందుకు అష్ట‌క‌ష్టాలూ ప‌డి ద‌క్కించుకుంటే..
అదే స‌హృద‌య‌త రెండో సారి చూపిన‌పుడు.. ఏకంగా ఆమెనుంచి దూరమ‌వ‌డానికి దోహ‌ద ప‌డింది..
ఈ సినిమాలోని రామ్ పాత్ర మ‌న‌కేం చెబుతుందంటే..
జాలి ద‌య రెండంచెల క‌త్తిలాంటిది.. అదెంత మోదాన్ని తీసుకొస్తుందో అంతే
ఖేదాన్ని పంచి పెడుతుంది.. కాబ‌ట్టి.. స‌మ‌యాన్నిబ‌ట్టి వీటిని వాడుతుండాల‌ని ఎత్తి చూపుతుందీ చిత్రం..
ఎప్పుడో రోజా త‌ర్వాత ఒక మిల‌ట‌రీ బేస్ ల మీదుగా సాగిన ఒక ప్రేమ క‌థ‌ను అందునా.. ఇంత‌టి హృద్యంగా మ‌లిచి చూపింది మాత్రం ఈ ద‌ర్శ‌కుడే..
త‌ర్వాత ఈ సినిమా సాధించిన మ‌రో ఘ‌న‌త ఏంటంటే..
ఎన్ని లొకేష‌న్లు ఛేంజ్ చేసినా.. అదే క‌నెక్టివిటీ..
ఎక్క‌డా క‌థ త‌న‌ గ్రిప్ కోల్పోలేదు.. ఫీల్ మిస్ కాలేదు..
ఎక్క‌డో లండ‌న్ లో మొద‌లైన క‌థ‌.. పాకిస్థాన్ చేరి.. అక్క‌డో ఉత్త‌రం ముక్క‌గా కుదించ‌బ‌డి.. దాన్ని తెరిచి చూప‌కుండానే పుంఖాను పుంఖాలుగా చెప్పుకుంటూ వెళ్లింది..
క‌శ్మీర్ అందాల‌తో పాటు దాని వెన‌క దాగిన బ‌డ‌బ‌బాగ్నులు.. పాకిస్థాన్ ముష్క‌రుల‌కు క‌శ్మీర్ ను క‌బ‌ళించ‌డానికి ఎన్నేసి కుట్ర‌లు చేస్తారో చెబుతూనే.. వారిలోనూ కొండొక‌చో కృత‌జ్ఞ‌తాభావాలుంటాయ‌ని చాటి చెబుతుందీ చిత్రం..
ఫ్రేమ్ ఫ్రేమ్ లోనూ ప‌ర్ఫెక్ష‌న్ పిచ్చెక్కించేసింది..
ఒక సాధార‌ణ అనాథ సైనికుడికీ అసాధార‌ణ యువ‌రాణికీ మ‌ధ్య పెన‌వేసిన ఆ ప్రేమానుబంధానికి ఫిదా కాని ప్రేక్ష‌కులుండ‌రేమో..
ఆ పొయిట్రీకి హేట్సాఫ్ చెప్పాల్సిందే..
క‌థ‌ను ఒక మూడ్ లో ఉండి రాసిన ఆ ద‌ర్శ‌కుడి గుండె చ‌ప్పుడు ప్ర‌తి స‌న్నివేశంలోనూ ల‌బ్ డ‌బ్ ల‌బ్ డ‌బ్ అంటూనే సాగింది..
క‌థ చెబితే ఇలా ఉండాలి..
కేవ‌లం ఆ పాత్ర‌లు త‌ప్ప‌.. ఎక్క‌డా దుల్క‌ర్ కానీ, మృణాల్ ఠాకూర్, కానీ ర‌ష్మిక మంథాన కానీ క‌నిపించ‌లేదు.. అడ్డ‌దిడ్డంగా హీరో ప‌రుచుకుపోయిన కాక‌ర‌కాయ‌లాంటి క‌థ కానే కాదు..
అచ్చ‌మైన స్వ‌చ్ఛ‌మైన అవ‌కాయ, మీగ‌డ‌పెరుగులాంటి క‌థాస్వాద‌న చేయించిన ఈ చిత్ర ద‌ర్శ‌కుడికి హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేం..
హ‌నురాఘ‌వ‌పూడి..
నీ పొయిట్రీకి
ఖుదాఫీస్

పేరులో అణువంత‌గా నువ్వు నీ సినిమా టైటిల్ క‌నిపించినా..
దాన్ని విడ‌మ‌రిచి చెబుతుంటే.. అండ‌పిండ బ్ర‌హ్మాండ‌మంత‌గా విస్త‌రించేశావ్ పో…
తెలుగు జాతి మెచ్చిన ఆణిముత్యాల్లాంటి ద‌ర్శ‌కుల్లో నీకూ ఒక చోటివ్వ‌కుంటే..
అది తెలుగు చిత్ర‌సీమ చేసుకున్న దుర‌దృష్ట‌మే అవుతుంది పో..
యూఆర్
ఆల్ టైం తెలుగు గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లోనే ఒక‌డివని చెప్ప‌డానికి
ఈ ఒక్క సినిమా చాలు..
థాంక్యూ హ‌ను
నీ విజువ‌ల్ ట్రీట్ కి ఫిదా ఫిదా!

– ‘ఆది’య‌న్

 

By admin