హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. శ‌నివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించునున్నారు.

కైకాల మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. “ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.” అని ట్వీట్ చేశారు.

సీహెచ్ విద్యాసాగర్ రావు (మాజీ గవర్నర్) సంతాపం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు అన్నారు.  777 చిత్రాలలో నటించిన ఆయన సినీ జీవితంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయార‌ని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాన‌ని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తమ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం

బ‌హుముఖ కళాకారుడు, మాజీ లోక్‌స‌భ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పురాణాల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు స్పష్టమైన వ్యక్తీకరణలతో విభిన్న పాత్రలను అలవోకగా పోషించిన మహోన్నత వ్యక్తిగా కైకాలను సీఎం జగన్ ప్రశంసించారు.

కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మాత అల్లు అరవింద్‌, నందమూరి బాలకృష్ణ, కల్యాణరామ్‌, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *