ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ దేశవ్యాప్తంగా మంచి జోష్‌లో ఉంది. పంజాబ్లో ఓటమి ఎదురైనా మిగతా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీని ఆనందాన్నిస్తోంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కీలకమైన యూపీలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. ఇదే జోరులో తదుపరి టార్గెట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వాళ్లను దెబ్బకొట్టేలా రాష్ట్రపతి ఎన్నికపై దృష్టి పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్‌ను కట్టడి చేసేందుకు.. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలుగు వ్యక్తినే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
యూపీలో వచ్చిన సీట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారతాయి. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తర్వాత అభ్యర్థి ఎవరనే విషయంపై బీజేపీ దృష్టి సారించింది. 776 మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాష్ట్రాల్లోని 4120 మంది శాసనసభ్యులతో ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వీళ్ల ఓట్ల విలువ ఆధారంగా ఎన్నిక ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి సగం కంటే ఎక్కువ బలం ఉంది. కాబట్టి మరోసారి బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తెలుగు వారికి సంబంధించి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్యానాయుడు, మహరాష్ట్ర గవర్నర్‌గా చేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు.. పేర్లు వినిపిస్తున్నాయి. దక్షిణాదిపై అందులోనూ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ ఏపీకి చెందిన వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం వైసీపీతో పాటు బిజూ జనతాదళ్‌తోనూ బీజేపీ చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఏకగ్రీవంగానే అభ్యర్థిని ఎన్నుకోవాలనే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మహారాష్ట్రకు ఐదేళ్లపాటు గవర్నర్‌గా కొనసాగిన చెన్నమనేని విద్యాసాగర్‌రావుకి ప్రస్తుతం బీజేపీలో ఎలాంటి పదవులు ఇవ్వలేదు. వివాదరహితుడైన ఆయనకు రాష్ట్రపతి పదవి ఇచ్చే యోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఇతరులకు ఛాన్స్ ఇస్తే విద్యాసాగర్ రావును ఉప రాష్ట్రపతిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సీనియర్ నాయకుడు కావడంతో విద్యాసాగర్ రావుకు బీజేపీ అగ్రనాయకత్వం కీలక పదవి అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇటు తెలంగాణలో, అటు జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని బీజేపీ చూస్తుందని ప్రచారం సాగుతోంది. మరి దేశ అధ్యక్ష పదవి అందుకున్న మూడో తెలుగు వాడిగా ఎవరు నిలుస్తారన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.
HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి సినిమా ఛాన్స్ – మీడియా అవకాశాలు అందుకొండి.. HyStar APP Google play store link: https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar website link: www.hystar.in