– ఎడిటోరియ‌ల్

త్రిదండి చినజీయర్‌ స్వామి త‌న వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వివాదంలో చిక్కుకుంటున్నారు. మేడారం వనదేవతలు సమక్క, సారలమ్మలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వనదేవతలను అవమానించే విధంగా ఉన్నాయని, మేడారం జాతరను హేళన చేసే విధంగా ఉన్నాయని., భక్తుల విశ్వాసాలను, ఆదివాసీ సంస్కృతిని తూలనాడే విధంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమక్క, సారలమ్మలపై చినజీయర్‌ గతంలో ఏ సందర్భంగా మాట్లాడారో తెలియదు గానీ కొన్నిరోజులుగా ఆ వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో తిరుగుతోంది. ఆ వీడియోలో చినజీయర్‌.. ‘‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ.. దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగొచ్చిన వారా? ఏమిటీ చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామ దేవత. చదువుకున్నవాళ్లు.. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. దట్‌ బికేమ్‌ ఏ బిజినెస్‌ నౌ (అది ఇప్పుడో వ్యాపారమైపోయింది)’’ అని అన్నారు. వీడియోలో ఆయన మాట్లాడిన మాటలపై ఆదివాసీ భక్తులు, వివిధ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. చినజీయర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత నారాయణ, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ములుగు జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. మేడారంలో అక్కడి పూజారుల సంఘం ఆధ్వర్యంలో చినజీయర్‌ దిష్టిబొమ్మకు చెప్పుల దండవేశారు.

ఆ దిష్టిబొమ్మకు చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను వనదేవతల గద్దెల ప్రధాన ద్వారం కూడలి వద్ద దహనం చేశారు. సమ్మక్క, సారలమ్మల గురించి మాట్లాడే స్థాయి జీయర్‌కు లేదని, తల్లుల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన జీయర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ భక్తులకు చినజీయర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని ములుగు జిల్లా వైఎస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివా్‌సరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పుడు జీయర్‌ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టామని, ఈ వ్యాఖ్యలు పునరావృతమైతే భక్తులు నేరుగా వెళ్లి ఆయన్నే చెప్పులతో కొడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ నేత చంద రఘుపతిరావు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద చినజీయర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడు పూజారులు నిరసన తెలియజేశారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో చినజీయర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపువారు ఫిర్యాదు చేశారు.

గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల చినజీయర్‌ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఓ సందర్భంగా మాంసాహారం విషయంలో ఆయన.. ‘‘పంది మాంసం తిన్నావనుకో పంది ఆలోచనలే వస్తాయి. మనిషి ఆలోచనలు రావు. మేక మాంసం తింటే ఆ బుద్ధే పుడుతుంది. అలా ఒకటి పోతుంటే దాని వెనకబడి పోవటమే వస్తుంది. సొంత బుర్ర పనిచేయదు. కోడిగుడ్డు తింటే కోడి బుద్ధే వస్తుంది. ఈ పెంట మీద ఆ పెంట మీద ఎరుకుతినడమే వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో ‘‘కులాలు పోకూడదండీ. కొంతమంది.. ప్రోగ్రెసివ్‌ థాట్స్‌ (ప్రగతిశీల భావాలు)తో ఉన్నామని అనుకునేవాళ్లు కుల రహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము.. అలాంటి సమాజం కావాలి అంటున్నారు. తప్పు! ఏ కులం పని ఆ కులం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.

గతంలో వీడియో.. ఇప్పుడెందుకు వైరల్‌?
ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ మధ్య విభేదాలు నెలకొన్నట్లు వార్తలొచ్చాయి. అప్పటిదాకా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన చినజీయర్‌… త్వరలో జరిగే యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమానికి దూరంగా ఉండటం ‘విభేధాల’ వార్తలకు బలాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడో సమక్క, సారలమ్మలపై చినజీయర్‌ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులే వీడియోను వైరల్‌ చేస్తున్నాయన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ స్వామీ…
‘‘ఓ ఆంధ్రా చినజీయర్‌ స్వామి.. మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మలపై ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశావ్‌? ఆదివాసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పు. కోట్లాది భక్తులు ఇలవేల్పులుగా కొలుచుకునే దేవతల కీర్తిని తగ్గించే విధంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వారు ప్రకృతి దేవతలు.. ప్రజల గుండెల్లో ఉన్నారు. అక్కడ రియలెస్టేట్‌ వ్యాపారం లేదు. దర్శనానికి టికెట్‌ లేదు. మీరేమో 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరుతో విగ్రహాన్ని పెట్టారు. రూ.150 టిక్కెట్‌ పెట్టారు. మా తల్లుల వద్ద జరిగేది వ్యాపారమా? సమతామూర్తి పేరుతో జరుగుతోంది వ్యాపారమా? తల్లుల కీర్తిని సహించలేక ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో సీఎం స్పందించాలి.
రియల్‌ ఎస్టేట్‌ స్వామి అయిన చినజీయర్‌కు తగిన బుద్ధి చెప్పాలి’’
-ములుగు ఎమ్మెల్యే సీతక్క

నేతలను చుట్టూ పెట్టుకొని మేధావిగా చెలామణి
‘‘మేడారం జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు వస్తారు.పన్ను విధానాలపై ఆనాటి పాలకులతో పోరాటం జరిపే క్రమంలో సమ్మక్క-సారక్క వెలుగులోకి వచ్చారు. రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను చుట్టూ పెట్టుకుని మేధావిగా చలామణి అయ్యే చిన జీయర్‌కు సమ్మక్క-సారక్కను విమర్శించే అర్హత లేదు’’
-సీపీఐ నేత నారాయణ

రాష్ట్రం నుంచి బహిష్కరించాలి: బీఎస్పీ రాష్ట్ర శాఖ వనదేవతలను కించపరిచిన చినజీయర్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని బీఎస్పీ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. చినజీయర్‌ హద్దులు మీరి మాట్లాడుతున్నారని, వనదేవతలను కించపరుస్తూ మాట్లాడాలని ఆయనకు సమతామూర్తి చెప్పారా? అని ప్రశ్నించారు.

గందరగోళం సృష్టించొద్దు: కొణతం దిలీప్
జీయర్ వ్యాఖ్యలను ఖండించండి కానీ, రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2012లో జరిగిన దాన్ని ఇప్పుడు జరిగినట్లు చిత్రీకరించి జనాలను గందరగోళపరచొద్దని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ అన్నారు. ఫేస్​బుక్​లో చేసిన ఆ కామెంట్లను కొద్దిసేపటికే డిలీట్​ చేశారు.

By admin