టాలీవుడ్‌లో మ‌రో సీనియ‌ర్ న‌టుడిని కోల్పోయింది. సీనియర్ న‌టుడు చలపతిరావు (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కొడుకు రవిబాబు, కూతుర్లు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.

1944, మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు చలపతిరావు. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సహాయ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా 1200కు పైగా సినిమాల్లో నటించారు. మహానటుడు ఎన్టీఆర్‌ దగ్గర నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మూడు తరాల హీరోలతో కలిసి వెండితెరపై ఒక వెలుగువెలిగారు. నిర్మాతగాను ఆయన గుర్తింపు పొందారు. తన నిర్మాణ సారథ్యంలో కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతిగారి అల్లుడు వంటి సినిమాలను తెరకెక్కించారు. పలు టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. ఆయన కుమారుడు రవిబాబు విలక్షణమైన నటుడిగా, దర్శకునిగా గుర్తింపు పొందారు. సినీ పరిశ్రమలో చలపతిరావును అంతా బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

By admin