తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో హేమాహేమీలు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఇపుడు గ్రూపు తగాదాలు ఆయా పార్టీలను చికాకులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి నెలకొంది. ఇపుడు తాజాగా ఆ వివాదంలోకి కాంగ్రెస్ చేరింది. దీంతో తాండూరు రాజకీయం వేడెక్కింది.
క్రితం ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిని ఓడించి పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపొందారు. తర్వాత కొన్నాళ్లకు రోహిత్ రెడ్డి కూడా గులాబీ గూటిలో చేరిపోయారు. దీంతో మాజీ తాజా వర్గాలకు అస్సలు పడడం లేదు. పార్టీ కార్యక్రమాలు మొదలుకొని నామినేటెడ్ పదవుల వరకు ప్రతి విషయంలో ఇరు వర్గాలు బహిరంగంగానే వాదనలకు దిగుతున్నాయి. మధ్యలో అధికారులను బలి చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దీనిపై ఇటీవల మంత్రి కేటీఆర్ హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్లింది.
దీనికంతటికీ కారణం వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్ గురించే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి టికెట్ తనకే వస్తుందనే ధీమాలో రోహిత్ రెడ్డి ఉండగా.. మహేందర్ రెడ్డి కూడా పార్టీ తరపున తానే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచానని.. పలు మంత్రి పదవులు చేపట్టానని సీనియర్ గా తనకే అవకాశం ఉంటుందని మహేందర్ రెడ్డి అంటుంటే.. రోహిత్ రెడ్డి మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతున్న తననే టికెట్ వరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగానే ఇటీవల మహేందర్ రెడ్డి సన్నిహితులు పెద్ద బాంబు పేల్చారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని లీకులు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎం రమేష్ లో ఆందోళన మొదలైంది. గత రెండు పర్యాయాలు పోటీకి అవకాశం వచ్చినా అనారోగ్య కారణాల వల్ల దూరంగా ఉన్న ఆయన ఈసారి కచ్చితంగా బరిలో ఉంటానని చెబుతున్నారు.
మర్రి చెన్నారెడ్డి ఎం మాణిక్ రావు, చంద్రశేఖర్ లాంటి ఉద్ధండులు ప్రాతినిథ్యం వహించిన ఈ ప్రాంతాన్ని టీఆర్ఎస్ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి మాణిక్ రావు చిన్నాన్న చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని.. కాంగ్రెస్ తరపున ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో పది మందికి టికెట్లు ఇచ్చే స్థానంలో ఉన్నానని.. ఈసారి తనను ఎవరూ అడ్డుకోవద్దని ఇతరులను కాంగ్రెసులో చేర్చుకోవద్దని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారు. దీంతో తాండూరు రాజకీయాలు మహారంజుగా మారాయి. ఇకపై ఎలాంటి పరిణామాలో చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.