బాక్సాఫీస్ లెక్కలు మరియు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ హీరోలను టైర్ 1 – టైర్ 2 అంటూ కేటగిరీలుగా విభజించి మాట్లాడుతుంటారు. చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – బాలకృష్ణ సూపర్ సీనియర్స్ గా కొనసాగుతుండగా.. మహేష్ బాబు – ప్రభాస్ – పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ వంటి హీరోలు టైర్-1 జాబితాలో ఉన్నారు. వీరి మధ్యే ఎక్కువగా నంబర్ గేమింగ్ నడుస్తుంది.
అయితే వీరందరూ ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా మారిన నేపథ్యంలో.. సంవత్సరం పొడవునా ప్రేక్షకులను అలరించించేది టైర్-2 హీరోల సినిమాలే. ఇప్పుడు పలువురు మీడియం రేంజ్ హీరోలు టాప్ లీగ్ లో చేరడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. వరుస విజయాలను అందుకుంటూ తమ మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ మార్కెట్ విస్తరించుకుంటున్నారు.
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యువసామ్రాట్ నాగచైతన్య.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా.. సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చారు. కథలో ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్నారు. వరుసగా చైతూ నటించిన ‘మజిలీ’ ‘వెంకీమామ’ ‘లవ్ స్టొరీ’ ‘బంగార్రాజు’ వంటి నాలుగు సినిమాలు 60 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నాయి. టైర్-2 హీరోల్లో చై మాత్రమే ఈ ఘనత సాధించారు.
ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ జూలై 8న విడుదల కాబోతోంది. అలానే చైతన్య బాలీవుడ్ డెబ్యూ ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టులో రాబోతోంది. ఈ ఏడాది ‘దూత’ వెబ్ సిరీస్ తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో వెంకట్ ప్రభు – పరశురాం పెట్లా – బొమ్మరిల్లు భాస్కర్ – కిశోర్ తిరుమల వంటి దర్శకులతో అక్కినేని హీరో వర్క్ చేయనున్నారు.
నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి మినిమమ్ గ్యారంటీ హీరోగా.. నిర్మాతల హీరోగా పిలవబడుతున్నారు. తనదైన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ విజయాలు అందుకుంటున్నారు. అందుకే చేతినిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా గడుపుతుంటారు. ‘ఎంసీఏ’ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ట్రై చేసిన నాని.. ‘వి’ ‘టక్ జగదీశ్’ వంటి రెండు సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు.
గతేడాది చివర్లో థియేట్రికల్ రిలీజ్ చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఇప్పుడు నాని నటించిన ‘అంటే.. సుందరానికీ!’ సినిమా జూన్ 10న మూడు దక్షిణాది భాషల్లో విడుదల కాబోతోంది. అలానే తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాల తర్వాత నాని మార్కెట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందని భావించవచ్చు.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ‘గీతగోవిందం’ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన వీడీ.. చివరగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. అయినప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్నాడు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. ఇది VD కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇదే క్రమంలో శివ నిర్వాణతో కలిసి ‘ఖుషి’ అనే పాన్ సౌత్ ఇండియా సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. దీని తర్వాత పూరీతో ‘జనగణమన’ వంటి భారీ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుకుమార్ మూవీ కూడా విజయ్ లైనప్ లో ఉంది. ‘లైగర్’ తో రౌడీ బాయ్ సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని కూడా ఇప్పుడు దూకుడుగా సినిమాలు చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రాపో.. పాన్ ఇండియా లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న ‘ది వారియర్’ అనే బైలింగ్వల్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 14న విడుదల కాబోతోంది. ఇదే క్రమంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఇది అఖిల్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇక యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.
ఇలా టైర్-2 హీరోల్లో చాలామంది టాప్ లీగ్ లో స్టార్ హీరోల సరసన చేరడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇతర భాషల్లోనూ తమ సినిమాలు రిలీజ్ చేసి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి టైర్-1 జాబితాలో చోటు సంపాదిస్తారో చూడాలి.