వైఎస్ జగన్ నేతృత్వంలోని YSRCP ప్రభుత్వం మరో కీలక పథకంతో ముందుకొచ్చింది. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. దివ్యాంగులైతే లక్షన్నర రూపాయలు అందించనున్నారు. బీసీలకు ఈ మొత్తం 50 వేలు, బీసీల్లో కులాంతర వివాహమైతే 75 వేల రూపాయలుగా నిర్ణయించారు. మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయల నగదు సాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, బీసీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఏపీ సీఎంవో అధికారులు తెలిపారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద అందించే మొత్తం వివరాలు చూస్తే..
ఎస్సీలకు – లక్ష రూపాయలు.
ఎస్సీల కులాంతర వివాహాలకు 1 లక్షా 20 వేల రూపాయలు.
ఎస్టీలకు – లక్ష రూపాయలు.
ఎస్టీల కులాంతర వివాహాలకు 1 లక్షా 20 వేల రూపాయలు.
బీసీలకు – 50 వేల రూపాయలు.
బీసీల కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు.
భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు.
దివ్యాంగుల వివాహాలకు 1 లక్షా 50 వేల రూపాయలు.
వైఎస్సార్ షాదీ తోఫా పథకంలో మైనారిటీలకు షాదీ తోఫా కింద – లక్ష రూపాయలు అందిస్తారు.
పేదింటి ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, వారికి గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా జగన్ సర్కార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి, సంక్షేమ పథకాల అమలులో వైఎస్ జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని వారు కొనియాడారు. ఈ పథకం కింద గత ప్రభుత్వం అందించిన దానికంటే అధికంగా నగదు సాయం అందుతుందని వైఎస్సార్ సీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు హయాంలో ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద ఎస్సీలకు 40 వేలు, ఎస్టీలకు 50 వేల ఆర్థిక సాయం ఉండగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని భారీగా పెంచారు.
</>
డిజిటల్ మీడియా దిగ్గజం
BREAKINGNEWS
www.breakingnewstv.co.in
BREAKINGNEWS TV
https://www.youtube.com/c/breakingnewsfocus/featured
BREAKINGNEWS APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews