కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 416 ఓట్లు తిరసర్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఇస్తోందని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి.

అయితే, గాంధీ కుటుంబం ఎవరికీ మద్దతు ఇవ్వట్లేదని సోనియా గాంధీ స్పష్టం చేశారని పలుసార్లు ఖర్గే అన్నారు. ఈ ఎన్నికలు పాదర్శకంగా జరగాలని శశి థరూర్ మొదటి నుంచి కోరుతున్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరోవైపు, రాహుల్ గాంధీ ఇవాళ ఏపీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడు ఇకపై ఎలాంటి పాత్ర పోషిస్తారన్న విషయంపై నేను మాట్లాడలేను. నిజానికి ఇక ఆయనే కాంగ్రెస్ లో నా పాత్ర ఏంటో నిర్ణయిస్తారు’’ అని చెప్పారు. ఖర్గేకు పలువురు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

By admin