♦️ నారమ్మగూడెం వాసికి డాక్టరేట్
♦️ శివర్ల అజయ్ కి అభినందనల వెల్లువ
హైదరాబాద్: (మీడియాబాస్ నెట్వర్క్): నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన శివర్ల అజయ్ కుమార్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆంగ్లంలో “మార్కెటింగ్ మైథాలజీ: ఏ స్టడీ ఆఫ్ ది మైథలాజికల్ వర్క్స్ ఆఫ్ అమిష్ త్రిపాఠీ, ఆనంద్ నీలకంఠన్ అండ్ దేవదత్ పట్నాయక్” అనే అంశంపై చేసిన పరిశోధనకు గానూ ఈ అవార్డు దక్కింది. ఈయన ప్రస్తుతం హైదరాబాద్ బడంగ్ పేటలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పని చేస్తున్నారు. శివర్ల అజయ్ వివిధ ప్రధాన పత్రికల్లో సుమారు పదేళ్ల పాటు వివిధ హోదాల్లో జర్నలిస్టుగా పనిచేశారు. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్, నమస్తే తెలంగాణ.. వంటి పత్రికల్లో పని చేసి సమాజం పట్ట తన బాధ్యతగా ఎన్నో కథనాలు రాశారు.
శివర్ల అజయ్ కి డాక్టరేట్ రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ ఎస్.భవాని, హెచ్వోడి(HOD) డాక్టర్ ఎన్.ఎస్.రాహుల్, తోటి అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. తన రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.