జిల్లా పాలనకు సుప్రిం కలెక్టర్. శాంతిభద్రతల హెడ్ ఎస్పీ. జిల్లా ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతాయుత పోస్టులో ఉన్న కొందరు సివిల్ సర్వెంట్లు దారి తప్పుతున్నారు. తెలంగాణలో కొందరు అధికారులు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లా పాలనకు సుప్రిం కలెక్టర్. శాంతిభద్రతల హెడ్ ఎస్పీ. జిల్లా ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతాయుత పోస్టులో ఉన్న కొందరు సివిల్ సర్వెంట్లు దారి తప్పుతున్నారు. తెలంగాణలో కొందరు అధికారులు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా రెండు జిల్లాల్లో జరిగిన పరిణామాలు జనాలు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. తమ హోదా మరిచి పబ్లిక్ మీటింగ్ లో పాలకులకు జై కొట్టారు ఉన్నతాధికారులు. పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా భజన చేశారనే విమర్శలు వస్తున్నాయి.

సెప్టెంబర్ 17ను సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఘనంగా నిర్వహించింది కేసీఆర్ సర్కార్. అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు, సభలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లోనే కలెక్టర్, ఎస్పీ రాజకీయ ప్రసంగం చేయడం దుమారం రేగుతోంది. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన జిల్లా కలెక్టర్ శరత్.. సీఎం కేసీఆర్ భజన చేశారు. కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్ గా అభివర్ణించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మకమంటూ ఆకాశానికెత్తారు. నిజానికి ఈ సభలో మాట్లాడిన అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఈ రేంజ్ లో కేసీఆర్ ను పొగడలేదు. కాని కలెక్టర్ మాత్రం సీఎంపై అదే పనిగా ప్రశంసల జల్లు కురిపించారు. పేద దళిత, గిరిజన వర్గాలకు కేసిఆర్ ఆశాదీపమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెచ్ అంబేద్కర్‌ను చూడలేదని, కేసీఆర్ రూపంలో ఇప్పుడు చూస్తున్నామని కామెంట్ చేశారు కలెక్టర్ శరత్. అంబేద్కర్ స్ఫూర్తితో  పేదల కోసం సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని కీర్తించారు.

జాతీయ సమైక్యత వేడుల్లోనే సుర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఏకంగా వేదికపైనే జేజేలు కొట్టారు. సభలో మాట్లాడిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. తాను ఎస్పీ అన్న విషయం మర్చిపోయారో ఏమో కాని.. సీఎం కేసీఆర్ ను పొగుతుడూ ఏకంగా మంత్రి జగదీశ్ రెడ్డిని జై అంటూ జై కొట్టారు. జయహో జగదీశన్న అంటూ పలు సార్లు  నినాదాలు చేశారు. తాను చేయడమే కాదు సభకు వచ్చిన జనాలతోనూ జయహో జగదీశ్ రెడ్డి అంటూ నినాదాలు చేయించారు ఎస్పీ రాజేంద్రప్రసాద్. సూర్యాపేట జిల్లా  ఎస్పీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కొందరు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేయడం పెద్ద దుమారం రేపింది. వరుసగా జరుగుతున్న ఘటనలతో తెలంగాణలో ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గౌరవమైన స్థానంలో ఉన్న అధికారులు పబ్లిక్ గానే చిల్లరగా వ్యవహరిస్తున్నారంటూ జనాలు మండిపడుతున్నారు.

By admin