• ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలకు సమానవాటా కల్పించాలని డిమాండ్
  • ఎస్సీ 57ఉపకులాల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో ఢిల్లీలో నిర‌స‌న‌లు

న్యూఢిల్లీ (జంతర్ మంతర్) మీడియాబాస్ నెట్‌వ‌ర్క్:
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలను A వర్గంలో చేర్చుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ చేసారు. మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాటసమితి అధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో కలిసి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాల ప్రజలు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారని అందుకు ఎస్సీ వర్గీకరణనే పరిష్కారమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి ఎస్సీలలో 34% ఉన్న దళితులలో అట్టడుగు వర్గాలైన 57 ఉపకులాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు.

ఇంతకాలం ఎస్సీ వర్గీకరణను మాల మాదిగల పంచాయతీగా చిత్రీకరించి రాజ్యాంగబద్ధంగా దళితులకు అందే అవకాశాలను ఈ రెండు కులాల వారే దక్కించుకున్నారన్నారు. మిగిలిన అత్యంత వెనుకబడిన ఎస్సి ఉపకులాలు తీవ్ర అన్యానికి గురయ్యారని, ఉమ్మడి రాష్ట్రంలో 2000-2004 సంవత్సరం వరకు అమలు జరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ రెండు కులాలే లబ్ధి పొందినట్లు అనేక నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాలకు కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానానికే 57 ఉపకులాలకు దక్కిందని, ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలలో అవకాశం అసలే రాలేదని, విద్యా అవకాశాల్లో 57 ఉపకులాలు 22 శాతానికి పరిమితమయ్యాయి, ఉద్యోగాలలో 12 శాతం మాత్రమే పొందగలిగారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎస్సీ/ ఎస్టీ కమిషన్ తదితర నామినేటెడ్ పదవులలో కూడా ఇంత వరకు ఎస్సీ ఉపకులాలకు ఎక్కడ అవకాశం కల్పించలేదని అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఎస్సీ 57 ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, ఉపాధి పరంగా ఎలాంటి లబ్ధి జరగలేదని, కనీసం కుల ధృవీకరణ పత్రాలను పొందడంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల కులగురువులైన మాదిగజంగం (నులక చందయ్య) కులాన్ని గెజిట్ లో చేర్చాలని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాదసికురువ/మాదారికురువ కులస్తులకు జాతీయ ఎస్సీ కమిషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణ ప్రభుత్వ Memo: 1268 ను అమలుచేసి గతంలో “కురువ (BC)” కులదృవీకరణ పత్రాలు ఇచ్చిన వారందరికి ఎస్సి మాదసికురువ కులదృవీకరణ పత్రాలు ఇవ్వాలని, కులద్రువికరణ పత్రాలను తహశీల్దార్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యా, ఉద్యోగ,రాజకీయ, ఆర్థిక ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఉపకులాలకు న్యాయమైన వాటా దక్కాలంటే నూతనంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఉపకులాల స్థితిగతులపై సమగ్ర విచారణజరిపి ఎస్సి ఉపకులాలను A వర్గంలో చేర్చి ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నందున అన్యాయానికి గురవుతున్న ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నామని, మా సమస్య పరిష్కారానికి మద్దతును ఇవ్వవలసిందిగా జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ ను, పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టాలని పలువురు కేంద్ర పెద్దలను కలిసామని తెలిపారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

By admin