మనసున్న ప్రతి ఒక్కరూ
మెచ్చే మంచి చిత్రం
*మాతృదేవోభవ* (ఓ అమ్మ కథ)
– డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి

సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ప్రస్తుతం కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న అవమానవీయ సంఘటనలను ప్రతిబింబిస్తూ తెరక్కించిన “మాతృదేవభవ” మనసున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు చిత్ర దర్శకులు కె.హరనాథ్ రెడ్డి. కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణల వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన హరనాథ్ రెడ్డి “మాతృదేవోభవ” (ఓ అమ్మ కథ) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీవాసవి మూవీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి సమర్పణలో చోడవరపు వెంకటేశ్వరరావు ఈచిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, పతంజలి శ్రీనివాస్, శ్రీహర్ష, అమృతా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు విడుదల సందర్భంగా కె.హరనాథ్ రెడ్డి ప్రత్యేకంగా ముచ్చటించారు.
“కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో నిర్మాతలు నన్ను సంప్రదించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇంత మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం నాకు చాలా గర్వంగా ఉంది. అందరూ మనీ (money) కోసం కాకుండా మనసు పెట్టి చేశారు. మా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఇప్పటికే వందలాది మందికి చూపించారు. ప్రతి ఒక్కరూ చమర్చిన కళ్లతో మెచ్చుకున్నారు. సందేశానికి వినోదం జోడించి అద్భుతంగా తీశానని నన్ను అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయిలో స్పదన వస్తుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధ గారి నటన అవార్డ్ విన్నింగ్ రేంజ్ లో ఉంటుంది. క్యాన్సర్ సోకిన తనను పిల్లలు కూడబలుక్కుని ఇంట్లోంచి గెంటేయాలని కుతంత్రాలు పన్నుతుండడం విని… తనే బయటకు వచ్చేసే సన్నివేశం అందరితో కంట తడి పెట్టిస్తుంది. జయసూర్య సంగీతం, మరుదూరి రాజా సంభాషణలు “మాతృదేవోభవ” చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. నా తదుపరి చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది!!

By admin