HYDERABAD (MediaBoss Network): బీజేపీ పెద్దలు సినీ గ్లామర్ కోసం తహతహలాడుతున్నారు. అందుకే వారి ప్రతి పర్యటనలోనూ ఏదో ఒక హీరోను బీజేపీ అగ్రనేతలు కలుస్తూ తెలంగాణలో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణలో గెలవాలని అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఆంధ్రా ఓటర్లను ఆకర్షించడంతోపాటు హీరోల సినీ గ్లామర్ ను బీజేపీకి మళ్లించాలని చూస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నితిన్ లను కలిసి బీజేపీ పెద్దలు.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అంత్యక్రియలను దగ్గరుండి చూసుకున్నారు. మున్ముందు మరింతగా టాలీవుడ్ ప్రముఖులతో సాన్నిహిత్యం నెరపాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలకస్థానంపై ముగ్గురు సినీ ప్రముఖులు కన్నేసినట్టు రాజకీయ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది 2023లోనే ఎన్నికలున్నాయి. అంటే ఇంకో ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఎన్నికల్లో ఆర్థికంగా ప్రజాదరణ ఉన్న నేతలతో పాటు గ్లామర్ ను కూడా దట్టించేందుకు నేతలు సన్నద్దం అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఇటీవల యాక్టివ్ అయ్యారు జీవితా రాజశేఖర్. కేసీఆర్ కూతురు కవితపై తీవ్ర ఆరోపణలు చేసి బీజేపీ నేతల కళ్లల్లో పడ్డారు. ఈమె జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కోసం ఆశపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ప్లాన్ చేసుకుంటునట్టు సమాచారం.
టాలీవుడ్ కు చెందిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ సైతం జూబ్లీహిల్స్ టికెట్ పై కన్నేసినట్టు సమాచారం. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ తీసి ఈయన బీజేపీకి దగ్గరయ్యారు. ఇక హీరో నితిన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పోటీలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే నితిన్ తో జేపీ నడ్డా కలిశాడని అంటున్నారు. ఈ ముగ్గురు సినీ ప్రముఖులు జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశపడుతున్నారని.. ఎవరి శక్తి మేరకు వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పారిశ్రామికవేత్తల కన్ను కూడా జూబ్లీహిల్స్ టికెట్ పై ఉందట.. బిజినెస్ మ్యాన్ ఆలపాటి లక్ష్మీనారాయణ కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది.