విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు స్వయంగా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు కేంద్రం సమయం కోరిందని లక్ష్మీనారాయణ తెలిపారు. హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసిందని.. తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అంతా మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. అందుకే ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని.. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని తెలిపింది. పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని.. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో పేర్కొంది. లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణార్హత లేదన్నారు. ఆ తర్వాత కూడా కోర్టులో వాదనలు జరిగాయి.. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రం రెండు వారాల సమయం కోరింది.

By admin