#GameChanzer

ఏకనాథ్ షిండే…ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు.. మహారాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా మార్చేసి ఏకంగా సీఎం పీఠంలో కూర్చున్నా షిండే పేరుని బీజేపీ నేతలు ఎక్కువ వాడుతున్నారు. శివసేనని రెండుగా చీల్చి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీతో జతకట్టి సీఎం పీఠం దక్కించుకున్న ఏకనాథ్ షిండే లాంటి వారు, తమిళనాడు, తెలంగాణలో కూడా వస్తారని, ఆయా రాష్ట్రాల్లోనే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ నేతలు.. షిండే పేరుని ఎక్కువ ప్రస్తావిస్తున్నారు, తెలంగాణలో కూడా షిండే లాంటి వారు ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలకు తాజాగా కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు…దమ్ముంటే షిండే లాంటి వారిని తెలంగాణలోకి తీసుకురావాలని మోదీకి సవాల్ విసిరారు. మీ ఉడుత ఊపులకు భయపడేవారు లేరని అన్నారు.

అయితే బీజేపీ షిండే గురించి మాట్లాడటం కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం బాగానే ఉంది కానీ తెలంగాణలో షిండే లాంటి వారు సాధ్యమా? అంటే.. రాజకీయాల్లో సాధ్యం కానిది ఏది లేదని ఈ మధ్యకాలంలో బీజేపీ నిరూపిస్తుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు షిండే లాంటి వారు రావడం కష్టమే. ఎందుకంటే టీఆర్ఎస్ కు 103 ఎమ్మెల్యేల బలం ఉంది. అటు ఎం‌ఐ‌ఎం తో కలుపుకుంటే 110 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు 6, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉంది.. అలాంటప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి షిండే లాంటి వారు పుట్టుకోవడం రావడం కష్టం…కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇంకా కష్టం.

అయితే తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ముందస్తుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు.. ఇక ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ.. ఇలా త్రిముఖంగా హోరాహోరీగా తలపడేలా ఉన్నాయి.. అప్పుడు ఎవరికి పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కుతుందో క్లారిటీ రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీ గాని.. 30-40 సీట్లు గెలుచుకుంటే… టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల్లో షిండే లాంటి వారిని పుట్టించి.. ఆ పార్టీలని చీల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి షిండే అనే క్యారెక్టర్ తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల తర్వాతే రావొచ్చు.

By admin