★ వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం అమలుపై ఖతార్ లో సమావేశం

వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌ల‌పై అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జ‌ర‌గ‌బోతోంది. రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసల కొరకు ప్రపంచ సంఘటిత ఒప్పందం (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్ ,ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ – జిసిఎం) అమలు గురించి ఆసియా-గల్ఫ్ దేశాల చర్చల సమావేశం ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్ దేశ రాజధాని దోహాలో జరగనున్నది. కార్మికులను ఉద్యోగం కోసం పంపే దేశాలు, కార్మికులను పనికోసం స్వీకరించే దేశాల ప్రతినిధులతో కీలకమైన చర్చలు జరిగే ఈ సమావేశానికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల జెఏసి నాయకుడు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి స్వదేశ్ పరికిపండ్లకు ఆహ్వానం అందింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఆతిథ్యం ఇస్తున్నది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఖతార్ లో ఫిఫా ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికుల హక్కులు, సంరక్షణ, వారి భవిష్యత్ అనే అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) సాధించడానికి గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాసం, పునరేకీకరణ ఒక వాహకం గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశంపై స్వదేశ్ పరికిపండ్ల ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. విదేశాల నుంచి వాపస్ వచ్చిన వారు జీవితంలో స్థిరపడటానికి భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాయి, ఎలాంటి ప్రణాళికలు రచించాయి, ఇందులోని విజయాలు, వైఫల్యాలపై స్వదేశ్ ఒక విశ్లేషణ పత్రాన్ని సమర్పిస్తారు.

ఈ సందర్భంగా స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. ”వలసదారులు తమ స్వదేశం, తాము పనిచేసే విదేశం అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు, గల్ఫ్ దేశాలకు జరిగే తాత్కాలిక శ్రామిక వలసలు ప్రధాన ఉపాధి నమూనాగా ఉన్నాయి అని అన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చిన వారిని తమ గ్రామంతో, సమాజంతో పునరేకీకరణ చేయడానికి వారు అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కూడా సహకరించాలి. తమ స్వదేశాల అభివృద్ధిలో వలసదారులు పోషించిన పాత్రకు, సహకారానికి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి, తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి” అని స్వదేశ్ అభిప్రాయపడ్డారు.

</>

డిజిట‌ల్ మీడియా దిగ్గ‌జం
BREAKINGNEWS
www.breakingnewstv.co.in

BREAKINGNEWS TV
https://www.youtube.com/c/breakingnewsfocus/featured

BREAKINGNEWS APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *