★ 89 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిన ప్రవాసులు
★ కోవిడ్ సమయంలో అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ చార్జీలతో ఇబ్బంది పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
★ గల్ఫ్ నుంచి వాపస్ వచ్చేవారి కోసం విపత్తు నివారణ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి

హైద‌రాబాద్:
ఈనెల 13, 14 న జీ-20 దేశాల కార్మిక మంత్రుల స్థాయి సదస్సు జరుగనున్న నేపథ్యంలో వలస కార్మికుల అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం సోమవారం ఇండోనేషియా లోని ‘మైగ్రెంట్ కేర్’ అనే సంస్థ సి-20 అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ (సభ్య సమాజ సంస్థలు) సమాంతర సమావేశాన్ని (సైడ్ ఈవెంట్) ను నిర్వహించింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్ (మిశ్రమ విధానం)లో ఇండోనేసియాలోని బాలిలో ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసి, జూమ్ ద్వారా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఆన్ లైన్ లో పాల్గొనేలా నిర్వహించారు.

సమావేశంలో జూమ్ ద్వారా ఆన్ లైన్ లో భారత ప్రతినిధిగా పాల్గొన్న వలస వ్యవహారాల విశ్లేషకులు, అంతర్జాతీయ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి మాట్లాడారు. కరోనా సందర్బంగా గల్ఫ్ నుంచి భారత్ కు వాపస్ వచ్చిన లక్షలాది మంది కార్మికులు వారికి రావాల్సిన జీతం బకాయిలు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ (ఉద్యోగ అనంతర ప్రయోజనాలు) పొందలేకపోయారని అన్నారు. గల్ఫ్ లోని కంపెనీ యాజమాన్యాలు కార్మికులకు జీత, భత్యాలు ఎగవేయడంపై ‘జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్’ (వేతన దొంగతనంపై న్యాయం చేయండి) అనే ఉద్యమం నడుస్తున్నది అని వివరించారు.

గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందిందని మంద భీంరెడ్డి తెలిపారు. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం అని అన్నారు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే సుమారు 10 మిలియన్లు (ఒక కోటి) మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికమని ఆయన అన్నారు. కోవిడ్ సందర్బంగా విదేశాల నుంచి వాపస్ వచ్చిన కార్మికులను అధిక విమాన చార్జీలతో కేంద్ర ప్రభుత్వం, క్వారంటైన్ చార్జీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టాయని మంద భీంరెడ్డి విమర్శించారు. వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు.

గల్ఫ్ దేశాల నుంచి రకరకాల కారణాల వలన వాపస్ వచ్చే వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒక శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని భీంరెడ్డి సూచించారు. కోవిడ్-19 మహమ్మారి వలన ఉత్పన్నమైన పరిస్థితులు, వాతావరణ మార్పులు, యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కంపెనీలు దివాలా తీయడం, వీసాలు లేని వారిని వాపస్ పంపే ఆమ్నెస్టీ (క్షమా బిక్ష) లాంటి సంక్షోభాలకు పరిష్కారం చూపేలా ఆకస్మిక ఆపద, విపత్తు నివారణ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

———————————————–

డిజిట‌ల్ మీడియా దిగ్గ‌జం
BREAKINGNEWS
www.breakingnewstv.co.in

BREAKINGNEWS TV
https://www.youtube.com/c/breakingnewsfocus/featured

</>

By admin