(న్యాయ వ్యవస్థలో సామాజిక మార్పు అనే అంశంపై CJI జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వ్యాసం)

“సామాజిక న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థలోనూ ప్రక్షాళన జరగవలసిందే..”

ఈ వ్యాఖ్యలు అన్నది మరెవరో కాదు సాక్షాత్తు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ నవంబర్ 12న ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు . అదే మాటను సామాన్యుడు లేదా మేధావులు, బుద్ధి జీవులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యమకారులు మాట్లాడితే ఈ దేశంలో దేశద్రోహం కింద కేసులు పెట్టెవారు కావొచ్చు. ఎందుకంటే మార్పును కోరడం, ప్రశ్నించడం, ప్రక్షాళనకై డిమాండ్ చేయడం నేరంగా భావించబడుతున్న ఈ దేశంలో న్యాయవ్యవస్థలో ఉన్నత స్థాయిలో రావలసిన మార్పులపై భారత సిజెఐ స్వయంగా, స్పష్టంగా, పరోక్షంగా ప్రభుత్వ బాధ్యతలను గుర్తిoప చేస్తూ చేసిన ప్రసంగం న్యాయ వ్యవస్థలో మరిన్ని కీలక మార్పులకు శ్రీకారం చుడుతుందని మేధావులు, సామాన్య ప్రజలు భావిస్తున్నారు . ఇంకా ఆయన మాట్లాడుతూ మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థ మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది. “నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే” అని నిర్మొహమాటంగా అన్నారు.
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే ప్రభువులు అని నినదిస్తూ సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లో ఉన్నదని ఎన్ని రాతలురాసినా ఆచరణలో అధికారమంతా చివరకు ఎన్నికల కమిషన్ కూడా పాలకులు, కార్పొరేటు సంస్థల చేతుల్లో, వారి కనుసన్నలలో కొనసాగడాన్ని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. దానివలన ప్రజలకు, సామాన్యులకు, పేదలకు అందవలసిన ఫలాలు సకాలంలో సవ్యంగా రాజ్యాంగబద్ధంగా అందకపోగా అనేక అంశాలలో న్యాయస్థానానికి వెళ్ళినప్పటికి కూడా న్యాయం దక్కడం లేదని సామాన్యుడు ఆందోళన చెందుతున్న విషయాన్ని ఎత్తిచూపితే కానీ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో రావలసిన మార్పులను అంచనా వేయలేము. విజ్ఞానము, ఆవిష్కరణలు, ఆలోచన విధానము, సంస్కరణలు , అధునాతన ధోరణులు జనజీవన స్రవంతిలోకి ప్రవేశిస్తున్నక్రమంలో అన్నిరంగాలతోపాటు రాజకీయ పాలనా సంస్కరణలు ముఖ్యంగా న్యాయవ్యవస్థలో రావలసిన మార్పులు కీలకమని అర్థమవుతూనే ఉన్నది. ఒక రంగం ప్రక్షాళన జరగాలంటే ఆ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే మార్పును కోరుతూ ప్రక్షాళనకై పూనుకున్నప్పుడు దాని పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం అంతగా ఉండదు. నాడు జస్టిస్ ఎన్వి రమణ గారి వలె నేడు వారి స్థానంలో ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడు గారు న్యాయవ్యవస్థలో రావలసిన మార్పుల పైన స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించడం సామాన్యులకు భరోసా అని విశ్వసించడంలో అతిశయోక్తి లేదు.

న్యాయవ్యవస్థలో అణగారిన వర్గాలకు ఆదినుంచి అన్యాయమే ..

ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క” అని ఇటీవల భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.కానీ ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నాఈ దేశ జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల ప్రాతినిథ్యం దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో లేక పోవడం వల్ల ఈ వర్గాల ప్రజలు అనేక సంధర్భాలలో అన్యాయానికి గురైన విషయాన్ని గమనించాలి .
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 30 సంవత్సరలకు అంటే 1980లో జస్టిస్ వరదరాజన్ గారు సుప్రీంకోర్ట్ జడ్డిగా నియమితులైనప్పుడు ఈ దేశ అత్యున్నత నాయస్థానం. తొలిసారిగా దళిత న్యాయ మూర్తిని పొందింది. ఈయన తరవాత దళిత వర్గాలనుండి జస్టిస్ B. C.రే, జస్టిస్ రామస్వామి, జస్టిస్ K.G బాలకృష్ణన్ గారు న్యాయముర్తులు గార్లు న్యాయ మూర్తులుగా వ్యవహరించగా వీరిలో 4వ దళిత న్యాయమూర్తి ఉన్న K.G బాలకృష్ణన్ గారు తొలి దళిత ప్రధానన్యాయమూర్తిగా 2007 నుండి 2010 వరకు విధులు నిర్వర్తించారు. మళ్ళీ రెండు దశాబ్ధాల తర్వాత సుప్రీంకోర్ట్ లో ఇద్దరు దళిత జడ్జీల నియామకం జరిగింది. ప్రస్తుతం జస్టిస్ శివకుమార్, జస్టిస్ B.R. గవాయ్ లు జడ్జీలుగా నియమించ బడగా వీరిలో జస్టిస్ గవాయ్ గారు 2025 సం॥లో 6 నెలలు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం మీద దేశంలో 20 శాతం జనాభా గలిగిన దళిత వర్గాలనుండి ఏడుగురు న్యాయమూర్తులు గా నియమించబడ్డారు.

1980 వరకు OBC మరియు SC కులాల నుండి ఒక్క జడ్జి కూడా సుప్రీం కోర్ట్ లో లేరు. తరువాత కాలంలో ఓబిసి వర్గానికి చెందిన జస్టిస్ SR పాండ్యన్, KN సైకియా, KS హెగ్డే, AN అలెగిరిస్వామి ఈ నలుగురు మాత్రమే సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు గా ఉన్నారు. ఇంత వరకు ఎస్టీలకు ఒక్క జడ్జి కూడా సుప్రింకోర్టులో లేరు , ముస్లింలలో 9మందికి అవకాశం లభించగా ప్రస్తుతం జస్టిస్ ఎంవై ఎక్బాల్, ఎస్ అబ్దుల్ నజీర్ లు సిట్టింగ్ జడ్జీలుగా ఉన్నారు. ఇక క్రిష్టియన్ల నుండి 9 మందికి అవకాశంరాగా ప్రస్తుతం జస్టిస్ భానుమతి, జస్టిస్ ఎం.జోసెఫ్ లు సిట్టింగ్ జడ్జిలుగా ఉన్నారు. సిక్కులు నలుగురు, జొరాస్ట్రియన్ లు ఐదుగురు, రెడ్డి సామాజికవర్గం నుండి ఒక్కరికీ అవకాశం లభించింది.

న్యాయ వ్యవస్థలో మొదటి నుండి బ్రహ్మనులదే ఆధిపత్యం 

సుప్రీం కోర్టు ఏర్పడిన నాటినుండి ఇప్పటి వరకూ 247 మంది న్యాయమూర్తులు నియామకం అయితే ఇందులో రాజకీయ పాలనా వ్యవస్థ తో సంబందం లేకుండా బ్రాహ్మణుల ప్రాతినిథ్యం సగటున 30 నుండి 40 శాతం స్థిరంగా ఉంది. సుప్రీంకోర్టు మొట్ట మొదటి పాలక వర్గంలో నాయముర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఆరుగురు ఉండగా ఇందులో ఇద్దరు బ్రాహ్మణులు, ఒక ముస్లిం, ఇద్దరు ఇతరులు అంటే బ్రాహ్మణులు 33.3 శాతం ఇక అప్పటి నుండి బ్రాహ్మణులకు నిర్ణీత అప్రకటిత కోటా ఇప్పటివరకూ కొనసాగుతుంది.
50 వ సిజేఐ ను నియమించే నాటికి 16 మంది బ్రాహ్మణ ప్రధాన న్యాయమూర్తులు అంటే దాదాపు 32 శాతం.1950 నుండి 1970 మధ్య కాలంలో 11మంది బ్రాహ్మణ న్యాయమూర్తులు నియమించబడ్డారు. 1971-1989 కాలంలో వీరి సంఖ్య మరింతగాపెరిగి ఏకంగా 17 మంది బ్రాహ్మణ న్యాయ మూర్తులు నియమించ బడ్డారు. 1988 లో సుప్రీం కోర్టు పాలక వర్గంలో మొత్తం 17 మంది న్యాయమూర్తులు ఉండగా వారిలో 9మంది అంటే బ్రాహ్మణులే 50 శాతం కంటే ఎక్కువ మంది నియమించబడ్డారు. ఇలా చాలా సందర్భాలలో జరిగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2004 నుండి 2014 వరకు నియమితులైన 52 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో 16 మంది బ్రాహ్మణులే అంటే 30.76 శాతం , ఐదుగురు వైశ్యులు, ముగ్గురు కాయస్తులు, ఇద్దరు రాజ్ పుత్ లు అంటే 50 శాతం అగ్రవర్ణ హిందువులు ఉన్నారు. ఇక 2014 నుండి కొనసాగుతున్న ప్రస్తుత పాలకవర్గంలో 35 మంది న్యాయమూర్తులకు గాను 8మంది రిటైర్ అవ్వగా మిగిలిన 27 మంది తమ సేవలందిస్తున్నారు. సిజెఐ NV రమణ గారు మాత్రమే ఏప్రిల్ 23, 2021 తర్వాత ప్రస్తుత పాలక సంస్థ యొక్క పదవీకాలంలో నియమించబడని ఏకైక న్యాయమూర్తిగా ఉంటారు. ఈ 35 మందిలో 9 మంది అంటే 26% బ్రాహ్మనులు వీరిలో న్యాయమూర్తులు UU లలిత్, DY చంద్రచూడ్, SK కౌల్, ఇందిరా బెనర్జీ మరియు V రామసుబ్రమణియన్ లు ఉండగా వీరిలో ఇద్దరు 2022లో ప్రధాన న్యాయమూర్తులుగా ఉండనున్నారు. ఐదుగురు వైశ్యులు అనగా 20% వీరిలో MR షా, హేమంత్ గుప్తా, వినీత్ శరణ్, అజయ్ రస్తోగి మరియు దినేష్ మహేశ్వరి లు ఉన్నారు . ముగ్గురు కాయస్థులు జస్టిస్ అశోక్ భూషణ్, నవీన్ సిన్హా మరియు కృష్ణ మురారి అనగా 8.5 శాతం, కులమతo పేర్కొననీ వారు ఐదుగురు ఉండగా జొరాస్ట్రియన్, ఎస్సీ, ముస్లిం, లింగాయత్, క్రిస్టియన్, కాత్రి, రెడ్డి, కోడార్ వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు.

గత మార్చి నెలలో జరిగిన రాజ్యసభ సమావేశంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి శ్రీ కిరణ్ రిజిజు గారు తెలిపిన ప్రకారంగా దేశంలోని 25 రాష్ట్రాలలోని హైకోర్టులలో ఉన్న ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 1108 కాగా ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ చెందిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 529 గా ఉంది. ఈ లెక్కన న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల స్థానం ఎక్కడో ఊహించవచ్చు . ఈ దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందినవారు ఈనాటికీ భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తులలో లో 56 శాతం , హైకోర్టులలో 40 శాతం న్యాయమూర్తులు ఉండడాన్నిబట్టి సామాజిక న్యాయాన్ని పాటించినట్లుగా ఎలా భవించగలం?

నేటికీ కొనసాగుతున్న అశాస్త్రీయమైన బ్రిటిష్ కాలం నాటి కొలీజియం వ్యవస్థ

సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర కేబినెట్ సలహాపై రాష్ట్రపతి నియమిస్తాడు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తుల నియమకానికి కావలసిన అర్హతలున్నాయి. కానీ ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన అర్హతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న న్యాయమూర్తిని అనుభవం ఆధారంగా చేసుకుని ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ద్వారా నియమించడం సాంప్రదాయం . నియామకం జరిగిన తరువాత వారు 65 సంవత్సరాల వయససు నిండేంతవరకు పదవిలో ఉంటారు. భారత న్యాయ వ్యవస్థలో ప్రథాన లోపం హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా ఏర్పాటు చేయడం . భారతదేశంలో అత్యున్నత స్థాయి పదవులైన ఐ.ఏ.యస్. లేదా ఐ.పీ.యస్.కు ఎంపిక కావాలంటే యు.పి.యస.సి. నిర్వహించే రెండంచెల వ్రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలలో అత్యథిక మార్కులు వచ్చిన అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. భారత దేశంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి ఇవే విథానాలు అనుసరిస్తారు. భారత న్యాయ వ్యవస్థలొనే క్రింద కోర్టులు లేదా జిల్లా కోర్టుల జడ్జీల నియామకం కూడా వ్రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల ఆధారంగా చేపడతారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవులైన హైకోర్టు, సుప్రీం కోర్టుల జడ్జీల నియామకాలు కొలీజియం అనే లోపభూయిష్ఠమైన వ్యవస్థ ద్వారా చేపడుతున్నారు.ఈ పద్దతిలో హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాలకి ఎటువంటి సామూహిక పోటీ పరీక్షలు రాయనవసరం లేదు. ప్రస్తుతం పదలలో ఉన్న హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలతో కూడిన కొలీజియం దృష్టిని ఆకర్షించే సామ, దాన, వేద, దండోపాయాలు తెలిసిన వారు మాత్రమే నెగ్గుకురావడం జరుగుతుంది.
ప్రస్తుత కొలీజియంలో ఐదుగురు సభ్యులు ఉంటే అందులో ముగ్గురు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. పైగా ఇక్కడ రిజర్వేషన్లు పాటించడమనేదిలేదు కొలిజియం చెప్పిందే శాసనం.

న్యాయవ్యవస్థపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మార్పుకు నాంది పలుకనున్నాయా?

“దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క” అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయ పడ్డారు.రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెబుతూ న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైందని . న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ఈ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు “. అంతేగాక ఈమద్యనే ఎన్నికల కమిషన్ పై వ్యాఖ్యానిస్తూ అవసరమైతే దేశ ప్రధానిపై చర్యలు తీసుకునే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండాలని ఈరోజుల్లో టి.ఎన్.శేషన్ లాంటి సీఈసి అవసరం ఎంతో ఉందని అన్నారు. మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలకు జవాబుదారిగా ఉండడంకోసం సుప్రీంకోర్టును సమాచార హక్కు పరిదిలోకి తెచ్చి ఈమద్యనే ఆర్టీఐ పోర్టల్ ను ప్రారంభించారు . ఈ క్రమం లోనే న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయానికి సమూల మార్పులకు నూతన సిజెఐ శ్రీకారం చూడతారని దేశంలోని అణగారిన వర్గాలు ఆశిస్తున్నారు .

న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావాలంటే..

న్యాయ వ్యవస్థ సమగ్ర స్వరూపం పట్ల, రావలసిన సంస్కరణల పట్ల ,న్యాయమూర్తుల బాధ్యతల పట్ల విస్పష్ట ప్రకటన చేసిన సిజెఐ గారి అభిప్రాయాల ప్రాతిపదికన ముఖ్యంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, అఖిలపక్షాలు ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఈ దేశంలో చాలా ఉన్నది .ఇక మరో రూపంలో పాలకులకు అంటించిన చురకను ఇప్పటికైనా గ్రహించి ప్రజా అనుకూల విధానాల పట్ల సానుకూలంగా ఉండవలసిన బాధ్యతను పాలకులు గుర్తిస్తే ప్రజలు కొంతవరకైనా సంతోషిస్తారు . ఇక న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసాన్ని ఉంచుతూనే అవసరమైన సందర్భంలో అన్యాయం జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ లోపలఉన్న లొసుగులను ఎత్తి చూపవలసిన బాధ్యత కూడా మన అందరి పైన ఉన్నది . “హక్కులకై కలబడినప్పుడు బాధ్యతలకు కూడా నిలబడాలి” అనే నినాదం ఆధారంగా న్యాయ వ్యవస్థ ద్వారా మన హక్కులను సాధించుకోవడానికి వెనుకాడకూడదు. అందుకు ప్రాతిపదిక అయిన రాజ్యాంగ స్వరూపం ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు అండగా ఉన్నది దానికి ప్రతిరూపమే న్యాయవ్యవస్థ కనుక ధైర్యంగా ప్రజా సమస్యలను న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకు వెళ్లడం ద్వారా ప్రజలు మరింత చేరువ కావలసిన అవసరం చాలా ఉన్నది. ప్రస్తుతం న్యాయవ్యవస్థకు మనకు సంబంధం లేదని, అది కేవలం అత్యున్నత స్థాయి అంశమని, ప్రజల కష్టసుఖాలు కేవలం పాలకులే తీరుస్తారని నమ్మకంతో ఉన్నాము . ఆ గుడ్డి ఆలోచన నుండి బయటపడితే తప్పకుండా న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వడం ద్వారా పాలకులపై ఒత్తిడి పెంచి హక్కులను సాధించడానికి కూడా అవకాశం ఉన్నదని సిజెఐ గారి యొక్క ప్రసంగం ద్వారా అవగాహన అవుతున్నది.

అయితే ఈ దేశంలో అనేకమంది బుద్ధి జీవులు మేధావులు హక్కుల కార్యకర్తలు ప్రజల కోణంలో పనిచేస్తూ తమ జీవితాలను బలి పెడుతున్నప్పుడు పాలకులు వక్రమార్గంలో ఆలోచించి, నేరస్తులుగా ముద్రించి, నేరము ఆరోపించబడి, రుజువు కాకుండానే సంవత్సరాల తరబడి శిక్షలను అనుభవించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి విజ్ఞతతో సానుభూతితో ఆలోచించి చట్టసభల్లో ఉన్న నేరస్తులను జైలుకు పంపి బుద్ధి జీవులు మేధావులు ప్రజల మధ్యన ఉండేలా న్యాయాన్ని విస్తృతపరచవలసినదిగా ప్రజల పక్షాన విజ్ఞప్తి. ప్రజాస్వామ్యం, అణగారిన వర్గాల పట్ల సానుభూతి, పురుషాధిక్యత పట్ల వ్యతిరేకత ఉన్న సిజేఐ విశాల హృదయాన్ని ఈ వైపుగా దృష్టి సారించాలని భారతదేశంలో పాలకులు బడా పెట్టుబడిదారుల వల్ల కృంగిపోతున్నటువంటి సామాన్య ప్రజానీకం ముఖంలో చిరునవ్వు వెలిగించడానికి కృషి చేయడం ద్వారా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని ఈ దేశ ప్రజలు మనసారా కోరుకుంటున్నారు .

వ్యాసకర్త :

– బైరి వెంకటేశం,

రాష్ట్ర అధ్య‌క్షులు,

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ రాష్ట్రం
Mobile : 9491994090

www.scsubcastes.org
email: scsubcastes@gmail.com

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

By admin