▪️ స్వచ్చమైన సమాజమే లక్ష్యంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్
▪️ క్యూఈఎఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ ప్రారంభోత్సవం
▪️ సాంకేతిక ప్రయాణంలోనే ఒక మైలురాయి
▪️ ఉత్తమ భవిష్యత్తును సృష్టించడానికి కృషి: శ్రీ అట్లూరి
న్యూయార్క్: స్వచ్చమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తన వెబ్‌సైట్ www.qef.org ను ఘనంగా ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలోనే ఒక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు అభివర్ణించారు. న్యూయార్క్ నగరంలోని ప్రముఖ తాజ్ హోటల్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన లక్ష్యాలను, దీర్ఘకాల ప్రణాళికలను తెలిపింది.
కృత్రిమ మేధ (AI) వంటి కొత్త టెక్నాలజీతో ప్రపంచమంతా ప్రతి నగరంలో స్వయం సమర్థంగా నడిచే ఛాప్టర్‌లను ఏర్పాటు చేసి, నాణ్యమైన వృత్తిపరులకు మార్గదర్శక శక్తిగా, వృత్తిపరులందరిని ఒక్కటిగా చేర్చడంలో ఈ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్‌సైట్ ప్రారంభం సందర్భంగా సద్గురు శ్రీ మధుసూదన్ సాయి తన ఆశీర్వచనాలతో పాటు నిర్వహులకు “ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం” అనే సందేశం అందించారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ.. ఉత్తమ సమాజ నిర్మాణం దిశగా సాగుతోన్న క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి తన సహకారం ఎప్పుడూ ఉందని ఈ సద్గురు మధుసూధన్ సాయి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) అభివృద్ధి కోసం మద్దతు తెలుపుతున్న సద్గురు శ్రీ మధుసూధన్ సాయిని శ్రీ అట్లూరి, కార్యదర్శి సంతోష్ యంసాని, QEF కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా QEF వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ.. “నాణ్యతా వృత్తిపరుల సమాఖ్యను బలోపేతం చేసే తమ కొత్త వెబ్‌సైట్ ద్వారా, తాము కొత్తగా, ఉత్తమైన, అందరికీ ఉపయోగపడే భవిష్యత్తును సృష్టించడానికి కృషి చేస్తున్నాము. ప్రపంచ సాంకేతికరంగానికే కేంద్రంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ వెబ్‌సైట్ అవతరిస్తుందని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలకు ఇదో దిక్సూచిగా మారనుంది” అని వివరించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాప్టర్లు ప్రారంభించబోతున్నామని, భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కూడా చాప్టర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
వివిధ రంగాలకు తమదైన పరిజ్ఞానంతో సరికొత్త సాంకేతిక సామర్ధ్యాలను అందివ్వాలన్న ఆలోచనతో తాము ముందుకు సాగుతున్నామని, ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పారు. సాంకేతిక ప్రపంచంలో ఉన్న ప్రమాణాలను అందుకోవాలనుకుంటున్న వారు.. తమ వెబ్ సైట్ సందర్శిస్తే.. వారికి తప్పకుండా తగిన సమాచారంతో కూడిన ప్రేరణ అందుతుందని, టెక్నాలజీలో ప్రస్తుతం సాగుతున్న ట్రెండ్ ఏంటో తెలిసి పోతుందని క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా చెప్పారు.
నిస్వార్ధ సేవలతో మాత్రమే ఈ ప్రపంచ నలుమూలలకు సమత – మమత – సౌభ్రాతృత్వాలను అందించగలమని చాటి చెప్పే సద్గురు మధుసూదన్ సాయి వారి స్ఫూర్తి తమను మున్ముందుకు నడిపిస్తోందని.. సద్గురు ఆశీర్వాదంతో క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజాన్ని మరింత ఉన్నతమైన నాణ్యతా విలువలతో నిర్మిస్తుందని నమ్మకంగా చెప్పగలమని కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.