- శిలాక్షరం
వచన కవిత్వ సంపుటి
గన్నోజు ప్రసాద్
రాగ సాహితీ వేదిక వరంగల్
సమీక్షకులు
అనూరాధ మెరుగు
కవయిత్రి,
స్కూల్ అసిస్టెంట్ హిందీ
హనుమకొండ
బరువైన పదాలతో కాక సహజ సుందరమైన సరళ భాషతో పాఠకులలో పరిపరి విధాలైన ఆలోచనలు రేకెత్తించి భావానికి మాత్రమే ప్రాధాన్యత నిచ్చి జీవితంలో ప్రభావితం చేసిన సంఘటనలతోనే అపురూప కవిత్వాన్ని రచించే కవి శ్రీ గన్నోజు ప్రసాద్ గారు.
అలవోకగా కవిత్వాన్ని పరుగులు పెట్టిస్తూ సమాజ చైతన్యం కోసం పాటుపడే నవతరపు సాహితీవేత్త శ్రీ గన్నోజు ప్రసాద్ గారు.
ఈ శిలాక్షర సువర్ణ అక్షరాలను ఆదరాభిమానాలే ఐశ్వర్యంగా భావిస్తూ తన కవన శక్తికి స్ఫూర్తి ప్రదాత అయిన ఆత్మ సోదరుడు ప్రతాపన్న గారి ఔదార్యతకు అంకితమిస్తున్నానన్న వారి తొలి పలుకులు పుస్తకానికి సహజాలంకృతాలు. వాక్యం రసాత్మకం కావ్యం అని ఆర్యోక్తి .
రసాత్మకమైన ఒకే ఒక్క వాక్యానికి కూడా కావ్య గౌరవాన్ని ఇచ్చారు పెద్దలు. అలాంటి రసాత్మకమైన వాక్యాలు ఈ సంపుటిలో కోకొల్లల్లు. శ్రామికపక్షపాతియై వారి శ్రమ తత్వానికి గుండెకరిగి ఆర్తితో స్పృషించిన కవితలు మనతో హృదయార్దృతను పంచుకుంటాయి.
జనపదాల్లోని సామాజిక జీవనం, మానవ సంబంధాలు, మనస్తత్వాలు ,మంచి చెడ్డలు, ఎత్తిపొడుపులు , ఉద్యోగపర్వంలోని ఘట్టాలు మిత్రులతో గడిపిన సందర్భాలు ఒకటేమిటి అన్నీ కవితా వస్తువులే…
ఇక పుస్తకం లోపలికి వెళితే ప్రతీ కవనం జనజీవన సౌకుమార్యాన్ని చాటి చెప్పేదే.
ప్రతి కవితలో అందంగా అత్యంత సహజంగా పొదగబడిన భావ సౌందర్యమే.
కాలుష్య భారాన్ని మోస్తూ వేడెక్కిన భూమి ఇంకా ఆ వేడి తగలని మనిషిని అనుశీలన చేసుకోమంటుందంటూ, ప్రకృతి మనిషి ఆశలను సంపన్నంచేస్తుంది కానీ పేరాశని కాదంటూ పర్యావరణ పరిరక్షణా స్పృహను కలిగిన వారి రచనా శైలికి మచ్చుతునక అనుశీలన.
కవి ఊహకు అందని కవిత తలంపుకు ఊతమై చీకటికి చిరాకు పుట్టేలా జ్యోత్స్నయై జోలపాటలు పాడి వెన్నెల వెలుగులు పంచి … మేఘానికి మెలకువ వచ్చి మౌనం వీడి అమృత జల్లులను మనసున కురిపించిందని సాక్ష్యం లేని సంబరాల జాతరను జరుపుకుంటాడు కవి.
నిజమే ప్రకృతి అందాలను ఆస్వాదించేటపుడు మనసుకు కల్గిన అనుభూతికి మనసే తప్ప వేరే సాక్ష్యం ఎందుకు..?
జీవితమంటే దాగుడుమూతలు దారులు ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు పాపపుణ్యాల పవనాలు సుఖదుఃఖాల పరిమళాలంటూ రాతకు అందని రంగులను సామాన్య ప్రజల అనుభవాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
పిలిస్తే పలకవు కాని పిలవని పేరంటానికి మాత్రం వస్తావు.
ఊరి పొలిమేరలు ముంచుతూ ఇంత పొగరెందుకు నీకు..? ఎవరు పిలిచారని ఎగురుకుంటూ వచ్చావు చాలు చాలు గాని ఇక చల్లబడమంటూ అనుకోని అతిధిలా వచ్చి ఊరిని ముంచెత్తుతున్న వర్షాన్ని వెనక్కి వెళ్లమని ఆత్మీయ స్నేహితుడిని అదిలించినట్టు సుతిమెత్తని పదాలతో అదిలిస్తారు.
వానలో ఊరు అల్లాడుతుందని ఆవేదన చెందుతారు.
కష్టాలకు బాధపడడం అనే బలహీనతను దూరంగా విసిరి బలం అనే బలగాన్ని వెంట ఉంచుకోమంటూ ఆనందైశ్వర్యాన్ని అందిపుచ్చుకో అంటూ బతుకు పరమార్థాన్ని వెతికి పెడతారు.
తొట్ట తొలి పొద్దులో కవి యొక్క గడ్డ కట్టిన కలం సిరాను వెచ్చని సాహిత్య కిరణం తట్టి లేపుతుంది. మనోభావపూరిత కవితలు వ్రాయమని పట్టి చెబుతుంది.
పక్షులు పసిడి రాగాలు తీస్తే… రైతు గుమ్మానికి వేలాడదీసిన వరి కంకుల తోరణాలతో వాటికి స్వాగతం చెపుతాడు.
ప్రకృతి సహజ సౌందర్యాన్ని ఇంతకంటే గొప్పగా ఇంకా ఎవరూ చెప్పలేరు.
కొన్ని చిన్నప్పటి అనుభవాలు ఎప్పుడూ మారవు.
వాటిని ఒడిసిపట్టి భావుకతా తేజస్పరిమళాలతో అందించడం ప్రసాద్ గారికి వెన్నతో పెట్టిన విద్య.
సెలవులకు సలాం చెప్పి సరదాలకు సెండాఫ్ ఇచ్చేద్దాం పుస్తకాలు ఫుల్ జోషులో ఉన్నాయి…చదువులమ్మ ఫుల్ ఖుషి లో ఉందంటూ
బ్రతుకుదెరువు కోసం బడిబాట పట్టమని పిల్లలను బడికి మళ్ళీ మరలిస్తాడు. నువ్వు లేక నల్లబల్ల అలకబూనిందని , ఆటస్థలం చిన్న పోయిందంటూ బడి సంచి పట్టుకొని బడిబాట పట్టమని విద్యార్థులకు స్వాగతం చెప్పడంలో ఎంత ఆత్మీయతో…
స్వయంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా మరి కవి. వారి యొక్క వృత్తి నిబద్ధత నిప్పక్షిక దృక్పథం పిల్లల పట్ల ప్రేమ బడి పిలుస్తుంది కవితలో ప్రస్ఫుటమవుతుంది.
వారి కవితలో వాన చినుకు రాకతో సిగ్గుపడిన నేల నవ్వుతుంది .
ఊరు పంటచేల పల్లకై ,అన్నపూర్ణకు అంగడై, నీటి కుంటల ఊటయై, చుట్టుపుట్ట కల్లుకుండల దాగి మురిసి పోతది.
తెలుగు పుస్తకం రంగుల హరివిల్లుగా మారి రాత్రి నిద్రను కుదిపి మధుర కార్యోన్ముఖున్ని చేస్తుందని.. కాలుతున్న చెట్లపై బర్డ్స్ మీటింగ్ ఏర్పాటుచేసి శ్రీ మాజానికి గొప్ప సందేశాన్నిచ్చే ప్రయత్నం చేశారు. చర్యాశీలత అని శీర్షికన సామాజిక దృక్కోణంలో తన కవితా జరిని చూపి మానవుని మెదడు కదలికలకు ప్రేరణ కలిగించారు.
కష్టసుఖాలని రెండు లేఖలను పంచుకొని రేపు అనే ప్రతీకకు నిదర్శనమైన నిశీధి చేరిన పాఠాన్ని ఊపిరి పోసి వదిలిన గాలిపటాల పయనాన్ని చిల్లుల నోటు పతనాన్ని వివరించడం వస్తువు లో నవ్యత కనిపిస్తుంది. ఆత్మ సంఘర్షణలో లోతులు తెలియని బాధలు మోసే ఓపిక ఉన్నోళ్లకే మోపెడు కష్టాలు అంటూ దుఃఖం సంతోషం సగమని నమ్మిన జీవికి ఏది ఎక్కువైనా తక్కువైనా తప్పిదమే అంటూ… ఆత్మ దర్శనం ఎలా అనే కవితలో కవి యొక్క పవిత్ర హృదయం పాఠకులకు ఒక దర్పణంగా దర్శనమిస్తుంది.
ఆధునిక సమాజంలో పుస్తక రచన మరియు పఠనం టెక్నాలజీ మత్తులో కొట్టుకుపోయాయనీ.. గూగుల్ ప్రళయ వాహినులై విశ్వగమనాన్ని శాసిస్తుందని టెక్నాలజీ కవితలో టెక్నిక్ ను కవి అత్యంత హృద్యంగా వివరించాడు.
దయ్యాల కార్ఖానా… అనే శీర్షికన
మన చుట్టూ ఉండే మనుషుల యొక్క మనస్తత్వ ధోరణి ని అత్యంత చాకచక్యంగా పదాలను పొందించి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కవితలో…
మూసిన పుస్తకం మడిచిన కాగితం
విప్పకపోతే జ్ఞాన సంపద పెరిగేదెలా? …
ఖాళీగా ఉంటే కాలక్షేపం
అనవసర పనులకు ఆర్భాటం
పనిలేని మెదడు దయ్యాల కార్ఖానా అంటూ సామెతను కవిత్వరూపం చేసి చూపిన గన్నోజు గారి శిలాక్షరం చైతన్య శిల్పానికి ప్రతీకగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలా సాహితీ సింగిడుల సమాహారం గన్నోజు గారి శిలాక్షరం
వినూత్న శైలిని అనుసరించి మదిని ఆకర్షించే భావ కవిత్వం వారి సొంతం.
సంపద కన్నా మానవత్వమే గొప్పదని నీతి విలువల నడుమ బ్రతకమని…సాహిత్యాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపి ఆవగింజంత కూడా గర్వం చూపని సాహితీ శిఖర మతడు. వారి శిలాక్షరం శిథిలం కాదు ఎప్పుడు ఎడారిలో కూడా హిమజలాలను కురిపించే వర్షం. మొండి మనుషులను తట్టి లేపే యదార్థవాదం వారి కవిత్వం
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
