శ్రీ సేవాలాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ నిర్మాతగా.. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం ‘బారసాల’. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శక, నిర్మాత లయన్‌ సాయి వెంకట్‌లు విచ్చేశారు. ముందుగా ప్రతాని, సాయివెంకట్‌ల చేతుల మీదుగా చిత్ర టైటిల్‌ లోగో ఆవిష్కరణ జరిగింది.

అనంతరం చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన రామకృష్ణగౌడ్‌ గారికి, సాయివెంకట్‌ గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మా యూనిట్‌ తరపున ధన్యవాదాలు. అలాగే నాకు దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్‌ గారికి థ్యాంక్స్‌. సినీ పరిశ్రమలో వివిధ రంగాలలో నేను పనిచేశాను. ఆ అనుభవంతో ఈ ‘బారసాల’ను తెరకెక్కించబోతున్నాను. నిర్మాత శ్రీనివాస్‌ గారు మంచి అభిరుచిగల వ్యక్తి కావడం.. అలాగే మంచి రచయిత కావడం కూడా మా సినిమాకు ఎంతో హెల్ప్‌ అవుతుంది అన్నారు.

నిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రచయితగా ఉన్న నేను నిర్మాతగా మారడం సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి గారు ఐతేనే ఈ సినిమాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని అనిపించింది. అందుకే ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాను. అందరినీ అలరించే అంశాలతో పాటు, కమర్షియల్‌ హంగులు కూడా ఇందులో ఉంటాయి. త్వరలోనే సినిమాను ప్రారంభిస్తాం. ఇతర టెక్నీషియన్స్‌ వివరాలు కూడా అప్పుడు వెల్లడిస్తాం. అలాగే చాలా మంది సినిమా రంగంలో తమ చిత్రాలకు టైటిల్స్‌ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సినిమాకు మంచి కథ ఎంత ముఖ్యమో.. మంచి టైటిల్‌ కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో మాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ‘ది టైటిల్స్‌ ఫ్యాక్టరీ’ని స్థాపించాను. మంచి టైటిల్స్‌ కొరకు మమ్మల్ని సంప్రదిస్తే మేం హెల్ప్‌ చేస్తాం. మా ఆహ్వానం మేరకు విచ్చేసిన పెద్దలు రామకృష్ణగౌడ్‌ గారికి, సాయివెంకట్‌ గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు ఇప్పుడు ఓటీటీ మంచి సపోర్ట్‌గా నిలుస్తోంది. థియేటర్స్‌లో ఫ్లాప్‌ అయిన సినిమాల్లో కొన్ని ఓటీటీలో హిట్‌ అవుతున్నాయి. కాబట్టి శ్రీనివాస్‌ గారు చేస్తున్న ఈ ‘బారసాల’ అటు థియేటర్స్‌తో పాటు, ఇటు ఓటీటీ వంటి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌పై కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి నా వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. మంచి టాలెంట్‌ ఉన్న టెక్నీషియన్‌. యూనిట్‌ అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నా అన్నారు.

దర్శక, నిర్మాత లయన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ.. మనిషి జీవిత ప్రయాణం మొదలయ్యేది బారసాలతోనే. అటువంటి ముఖ్యమైన ఘట్టంను టైటిల్‌గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు శ్రీనివాసరెడ్డి గారు మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. నేను కళ్లారా చూశాను నా రామానుజం చిత్రం విషయంలో చాలా సపోర్ట్‌గా నిలిచారు. రామకృష్ణగౌడ్‌ గారు చెప్పినట్టు చిన్న చిత్రాలకు ఇప్పుడు మంచి వేదికలు డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఇందుకు మా సపోర్ట్‌ కూడా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్‌ గారికి ఈ సినిమా విజయం సాధించి మరిన్ని సినిమాలు చేసే సపోర్ట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఒక నిర్మాతగా సినిమా పురిటి కష్టాలు నాకు తెలుసు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి గారు అనుభవశాలి కావడం, నిర్మాత శ్రీనివాస్‌ గారు రచయిత కూడా కావటం ఈ సినిమాకు ప్లస్‌ అవుతుంది. మంచి అభిరుచితో ‘బారసాల’ జరుపుకోబోతున్న యూనిట్‌ అందరికీ నా స్పెషల్‌ విషెస్‌ అన్నారు.

By admin