తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయా వ్యూహాలలో ఆరితేరిపోయారు. కొండ అంచు నుంచి మళ్ళీ పైకి ఎగబాకి తానున్న చోటుకు చేరుకునే సత్తా ఆయనకు ఉంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా నిబ్బరంగా ఎదుర్కోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఇక ప్రత్యర్ధితో మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట. విషయానికి వస్తే అతి ఉత్సాహాంతో హైదరాబాద్ వైపుగా దూసుకుని వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మనసుని ఎలా రగిలించాలో కేసీఆర్ కి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదేమో.
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): ఒక వైపు దేశానికి నాయకత్వం వహిస్తున్న బలమైన ప్రధానిగా ఎదురులేని నేతగా ఉన్న మోడీ వచ్చారు. ఆయన ఈ మధ్య విదేశాలకు వెళ్తే ఆయన కరచాలనం కోసం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ వెతుక్కుంటూ వచ్చిన సంగతి కూడా వీడియోలో అంతా చూశారు. ఇక దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాకా బీజేపీ బలం పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు.
హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు మహారాష్ట్రను కూడా తమ ఖాతాలో వేసుకుని రెట్టించిన జోరులో హుషారులో ఉన్న మోడీకి మండించేలా కేసీఆర్ ఫక్తు హైదరాబాద్ రాజకీయం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి. ఆయన గెలుపు కూడా అనుమానం. ఇక బీజేపీని మోడీనికి ఏదోలా ఎదిరించాలన్న ఉద్దేశ్యంతో పోటీకి పెట్టారు తప్ప యశ్వంత్ గెలిచేస్తారు అని కాదని విపక్ష శిబిరం పెద్దలకూ తెలుసు.
అలాంటి యశ్వంత్ సిన్హా తన ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన తానుగా కేసీయార్ ని కలవాలి. తన అభ్యర్ధిత్వం గురించి చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. యశ్వంత్ సిన్హా బేగం పేట ఎయిర్ పోర్టులో ఇలా దిగీ దిగగానే ఆయనే ప్రస్తుత రాష్ట్రపతి అన్నట్లుగా కేసీయార్ ఎదురేగి మరీ స్వాగతం పలికారు. అంతటితో ఊరుకున్నారా పదివేల బైకులతో సిటీలో భారీ ర్యాలీ తీయించారు. జలవిహార్ వేదికగా యశ్వంత్ ని ముందు పెట్టి మోడీని చడామడా విమర్శించేశారు.
మోడీ హైదారాబాద్ వస్తే ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సింది సీఎం హోదాలో కేసీఆర్. కానీ ఇప్పటికి రెండు మూడు సార్ల నుంచి ఆయన గైర్హాజర్ అయ్యారు. ఈసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ తోనే ఆ పని చేయించారు. ఒక వైపు మోడీతో తనకు వ్యక్తిగత తగాయిదాలు లేవని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రధాని తమ రాష్ట్రానికి వస్తే మాత్రం ముఖం చాటేయడం చర్చకు తావిస్తోంది. అంతటితో ఊరుకోని కేసీఆర్ పుండు మీద కారం చల్లినట్లుగా యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకడం.
నిజంగా ఈ టైమ్ లో మోడీ హైదరాబాద్ రాకపోయినా బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో పెట్టకపోయినా యశ్వంత్ కి అంతటి భారీ స్వాగతం టీయారెస్ కానీ కేసీయార్ కానీ ఇచ్చేవారా అన్నది ఒక సూటి ప్రశ్న. దీనికి సమాధానం రాజకీయాల్లో తల పండిపోయిన యశ్వంత్ కి కూడా తెలియకుండా ఉంటుందా. మోడీ పై మంటతో తన మీద పన్నీరు చల్లుతున్న కెసీఆర్ ని చూసి ఈ రాజకీయ మేధావి ఏమనుకుంటారో ఆయన మనసుకే తెలుసు మరి.