హైద‌రాబాద్(మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
తెలంగాణ గీత వృత్తిదారుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీలో అతి ముఖ్యమైన ఘట్టం నీరా, నీరా అనుబంధ ఉత్పత్తులతో పాటు ఇతర బై ప్రొడక్ట్స్ తయారు చేయుటకు ప్రతిష్టాత్మక FSSAI లైసెన్సు జారీ అయింది. ఈ సంద‌ర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ నీరాకు FSSAI లైసెన్సు జారీ కావ‌డం రాష్ట్ర నీరా చరిత్రలోనే ఒక గొప్ప సువర్ణాధ్యాయమ‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ సీఎం కేసీఆర్ ప్రకృతి సిద్ధమైన నీరా, కల్లును ద్రవ పదార్థముగా గుర్తించి నీరా పాలసీని ప్రవేశపెట్టారు.

సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికుల మాత్రమే ఉత్పత్తి చేసేందుకు, అమ్ముకునే విధంగా నీరా పాలసీని ప్రవేశపెట్టార‌ని, అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన నెక్లెస్ రోడ్ లో సుమారు 10 కోట్ల రూపాయల తో నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. అందులో భాగంగా నేడు Food Safety and Standard Authority of India (FSSAI) లైసెన్సు సాధించటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాన‌ని, సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నీరా కేఫ్ లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం MD మనోహర్, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు దత్తరాజ్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

By admin