– జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని
ములుగు: 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన (RBVP) సైన్స్ ఫెయిర్ 2024 ప్రదర్శనకు ములుగు జిల్లా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు జి పాణిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిసెంబర్ నెల 16 నుండి 21 వరకు హర్యానాలో నిర్వహించబడే జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ములుగు జిల్లా జడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం పాఠశాలలోని శ్యాంసుందర్ రెడ్డి బయోసైన్స్ ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో రక్షిత, మైథిలి విద్యార్థులు తయారు చేసిన ఇంటలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్ అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికైందని, ఈ సందర్భంగా విద్యార్థులను వారి గైడ్ టీచర్ శ్యాంసుందర్ రెడ్డిని, వారిని ప్రోత్సహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్యని డీఈవో అభినందించారు.
అనంతరం జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం విద్యార్థులు తయారు చేసినటువంటి ఎగ్జిబిట్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. గతంలో కూడా జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు బయో సైన్స్ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులు జాతీయస్థాయి ప్రదర్శనలకు హాజరయ్యారని చెప్పారు. జిల్లాలోని సమస్త యాజమాన్య పాఠశాలలు ఈనెల చివరి వారంలో నిర్వహించబడే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కు విద్యార్థులను సంసిద్ధులను చేస్తూ శాస్త్రీయ, సృజనాత్మక ఆలోచనలతో ఎగ్జిబిట్లు తయారుచేసి ప్రతి పాఠశాల నుండి సైన్స్ ఫెయిర్‌కు హాజరుకావాలని, దీంతో విద్యార్థులకు బాల్య దశ నుండే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందుతాయని తెలిపారు.
-
ప్రతిభకు గుర్తింపు లభించింది– శ్యాంసుందర్ రెడ్డి, గైడ్ టీచర్(స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం)
జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం చాలా ఆనందం ఇచ్చింది. శాస్త్రీయ ఆలోచనలతో విభిన్న కోణంలో ఆలోచించి విద్యార్థులను సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనేలా చేయడం కోసం నన్ను ప్రోత్సహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొయ్యడ మల్లయ్యకి, రాష్ట్ర సౌత్ ఇండియా ప్రదర్శనలలో పాల్గొనుటకు మార్గదర్శకత్వం చేస్తూ నిత్యం అన్ని విధాల సహకరించినటువంటి జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ కి, జిల్లా విద్యాశాఖ అధికారి పాణినికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలు, వైజ్ఞానిక ప్రదర్శనలపై మక్కువ చూపిస్తూ నా గైడెన్స్ సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయికి ఎంపిక కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు దేశంలోని ఐఐటీలలో 5 శాతం సీట్లు కేటాయించబడుతున్నాయి. కావున విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలలో తప్పక పాల్గొనాలి, శాస్త్రీయ వైఖరులను పెంపొందించుకోవాలి.
- కొయ్యడ మల్లయ్య
హెడ్ మాస్టర్ జెడ్పి హెచ్ఎస్ రామన్నగూడెం,
ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారని, సైంటిఫిక్ టెంపర్ అలవడుతుందని, విజ్ఞానమే మానవాభివృద్ధికి మూలమని కొనియాడుతూ, విద్యార్థులకు, గైడ్ టీచర్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.