🔘 న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో శైలేష్ సజీవదహనం
🔘 మృతదేశం సగం కాలిపోవడంతో స్వదేశంకు పంపలేని పరిస్థితి
🔘 అమెరికాలోనే అంత్యక్రియలు పూర్తి చేసిన ఎన్నారైలు
🔘 స్వగ్రామంలోని కుటుంబీకులు చూసేలా ఎల్ఈడీ తెర ఏర్పాటు
🔘 గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు
🔘 కంట తడి పెట్టిస్తోన్న ఘటన
ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం..
ఉన్నత చదువులు చదువుతాడనుకున్న కొడుకు ఇక లేడు..
దేశంకానీ దేశం నుంచి తిరిగి వస్తాడనుకుంటే విధి కాటేసింది..
ఉన్నత చదువులు చదువుల కోసం దేశంకానీ దేశం వెళ్లిన కొడుకు ఇక లేడు.. ఇక రాడు అన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల పుత్రశోకం అందరిని కంట తడి పెట్టిస్తోంది.. చివరి చూపుకు కూడా నోచుకోలేని పరిస్థితి ఇప్పుడు విషాదంగా మారింది..
(న్యూజెర్సీ నుంచి స్వాతి దేవినేని కవరేజీ )
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి సజీవదహనం ఘటన అందరినీ కలిచివేస్తోంది. భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన మృతుడు శైలేష్ గుర్రపు (23) జూన్ 3న న్యూజెర్సీలో శనివారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో మృతి చెందాడు. గుర్రపు శైలేష్ బయోమెడికల్ ఇంజినీరింగ్ చదివేందుకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడు. అక్కడ న్యూజెర్సీలో ఉంటూ తన స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. శనివారం కూడా ఎప్పటిలాగానే శైలేష్ గుర్రపు తన కారును నడుపుతుండగా ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. తీవ్రంగా కాలిన గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడు తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.
మృతదేహం భారత్ కు తీసుకొచ్చే పరిస్థితి లేదు. సగానికి పైగా కాలిపోవడంతో వెంటనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితిలో ఎన్నారై మిత్రులే అన్నీ తామే అయి అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు. బాధా తప్త హృదయంతో శైలేష్ సహచరుడు వినయ్ మొదటినుంచి, అందరిని కలుపుకునే కార్యక్రమాలు పూర్తి చేయగా, అఖిల్ దహన సంస్కారాలు చేశారు. తానాకు చెందిన లక్ష్మి దేవినేని సహకారంతో అంతిమ సంస్కరాలు పూర్తి చేశారు. మిగతా తెలుగు సంఘాలు కూడా వీరికి అండగా నిలిచాయి. తెలుగు ఎన్నారైలు కలిసి కట్టుగా చేసిన ఈ కార్యక్రమం అందరి హృదయాలను తాకాయి. ఈ ప్రక్రియను స్వగ్రామంలోని కుటుంబీకులు చూసేలా ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
తల్లిదండ్రుల సమక్షంలో స్వదేశంలో జరగాల్సిన అంత్యక్రియలు దేశంకానీ దేశంలో జరగడం అందరిని కంట తడి పెట్టిస్తోంది. తల్లిదండ్రుల చెంతకు కొడుకు మృతదేహాన్ని తీసుకురాలేని పరిస్థితి అందరిని కలిచివేస్తోంది. కంటతడిపెట్టిస్తోంది.