తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే శాసనసభాపతిని ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటెరియేట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ నెల 14వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు సభాపతి ఎన్నిక జరగనున్నట్లు నోటిఫికేషన్​లో అసెంబ్లీ సెక్రటేరియట్ పేర్కొంది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారి నుంచి 13న నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. 13వ తేదీన పదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నుంచే సభాపతి ఎన్నిక కానున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను సభాపతిగా కాంగ్రెస్‌ ఇప్పటికే నిర్ణయించింది. ప్రోటెం స్పీకర్‌ సమక్షంలో సభాపతి ఎన్నిక జరగనుంది.

By admin