జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు.ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 2019 ఆగస్టు 5న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ సోదరసోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది అని తెలిపారు. భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చిందని చెప్పారు.జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజల కలలను నెరవేర్చేందుకు తాము నిబద్ధతతో ఉన్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదని.. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణమని ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని పేర్కొన్నారు. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే సంకల్పానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు నిదర్శనం అని మోదీ అన్నారు.