టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట వద్ద నిర్వహించిన పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం లోకేశ్‌తో పాటు బ్రాహ్మణి, దేవాన్ష్‌, మోక్షజ్ఞ పాదయాత్రలో పాల్గొనడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.జనవరి 27వ తేదీన కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆరంభం నుంచి వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల నుంచి అవరోధాలు ఎదురయ్యాయి. అయినా సరే లోకేశ్‌ ప్రజాగళం వినిపిస్తూ ముందుకు సాగారు. పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించగా.. అన్నివర్గాలూ పాదయాత్రకు నీరాజనం పలికాయి.

By admin