హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు వెలిచాల జగపతి రావు మరణవార్త తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు అన్నారు. రాజకీయాలపైన కేవలం కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రంలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలలో చురుకుగా పాల్గొనే వార‌ని, ఆయన ప్రత్యేక తెలంగాణ సాధనలో తమవంతు బాధ్యతను నిర్వహించార‌ని తెలిపారు. సాగునీటి పథకాల గురించి ఎన్నో ప్రసంగాలను శాసన సభలో, శాసన సభ బయట చేసి అందరిని ఆలోచింప చేశార‌ని విద్యాసాగర రావు కొనియాడారు. నీటి పారుదల రంగానికి సంభందించి, ఇతర సామాజిక సమస్యల గురించి ఎన్నో వ్యాసాలు, పుస్తకాలను రాసి మన్ననలను పొందార‌ని, వారి అకాల మరణం వారి కుటుంబ‌ సభ్యులకే కాకుండా ఎంతో మందికి బాధను కలిగించింది, వారు లేని లోటును భర్తీ చేయలేము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూత

హైదరాబాద్‌: కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

జగపతిరావు 1935లో జన్మించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తర్వాత 1978లో గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కాగా, 1989లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. కొంతకాలంపాటు తెలంగాణ లెజిస్లేచర్‌ ఫోరం కన్వీనర్‌గా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా, జగపతిరావు మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడని, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారని చెప్పారు.

 

By admin