- భారతదేశ చరిత్రలో వెలుగులోకి రాని మహాపరాక్రమ వీరుడు లహుజి రఘోజీ సాల్వే ( అది క్రాంతి గురు, వస్తాద్) 230వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
– ( 14-11-1794 నుంచి 17-02-1881)
జీవితాన్నంతా దేశశ్రేయస్సు, సమాజం కోసం అంకితం చేసిన ప్రథమ భారత స్వాతంత్య్ర సమరయోధుడు లహుజి రఘోజీ సాల్వే. భారతదేశ చరిత్ర గతిని మార్చిన మహాపురుషులలో అగ్రగణ్యుడు ‘అది క్రాంతిగురు’గా చరిత్రలో అజరామరం అయ్యారు.
లహుజి రఘోజీ సాల్వే ప్రస్తుత మహారాష్ట్రలోని పురంధర్ సమీపంలోని ‘పేత్’ అను గ్రామంలో నవంబర్ 14 , 1794 న జన్మించారు. ఆయనది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అతి ప్రాచీన సామాజిక వర్గాల్లో ఒకటి మాంగ్ కులం. తల్లి పేరు విఠాబాయి, తండ్రి పేరు రఘోజీ సాల్వే ( పులులతో పోరాడగల శక్తిసామర్థ్యాలు గల అత్యంత పరాక్రముడైన, గొప్ప మరాఠా పోరాట యోధుడు). ఫిబ్రవరి 17, 1881న 87 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. వీరి సమాధి ప్రస్తుతం పుణెలోని ‘సంగం వాడి’ వద్ద ఉంది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం లహుజి సమాధి పరిరక్షణ బాధ్యతలు తీసుకుంది. లహుజిని అందరు ప్రేమతో ‘లహుజిబువా మాంగ్’, ‘వస్తాద్’ , ‘ధర్మవీర్, ‘అది క్రాంతి గురు’ అని పిలుస్తారు.
తన కుటుంబంలోని వీరోచిత పురుషుల నుంచి అనేక యుద్ధ కళల (మార్షల్ ఆర్ట్స్) యందు శిక్షణ పొందడం జరిగింది, అనగా కత్తిస్వాము, దాన్ పట్టా , కర్రలను వేగంగా ఆడించడం (కర్రస్వాము), బాణాలు వేయడం, గుర్రపుస్వారీ, తుపాకీ కాల్చడం మొదలగు అనేక యుద్ధకళల యందు ప్రావిణ్యం సాధించారు.
మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో (1817 – 1819) భాగంగా మరాఠా సైన్యానికి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి 1817 సంవత్సరంలో నవంబర్, 5 రోజున ఖడికి వద్ద యుద్ధం ప్రారంభం అయింది. మరాఠా సైన్యంలోని ఒక సైనిక పటాలముకు లహుజి తండ్రి రఘోజీ సాల్వే నాయకత్వం వహించారు. కేవలం 23 సంవత్సరాల వయస్సు గల లహుజి తన తండ్రికి సహాయంగా ఆ యుద్ధంలో పాల్గొని, తండ్రికి తగ్గ తనయుడులాగా అత్యంత ధైర్యసాహసాలతో రణభూమిలో తన పరాక్రమాన్ని, యుద్ధ కౌష్యలమును ప్రదర్శించారు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతిలో మరాఠా సైన్యం ఓడిపోవడం, మాతృభూమి రక్షణకై 12 రోజులపాటు బ్రిటిష్ సైనికులతో ప్రాణాలు ఉన్నంతవరకు వీరోచితంగా పోరాటం చేసిన తండ్రి, తన కళ్ళ ముందే అమరవీరుడు కావడం చూసిన లహుజి దీనిని భరించలేకపోయాడు. కోపం అనే అగ్నిలో దహించుకుపోయాడు. రణభూమిలో అక్కడికక్కడే వీరమరణం పొందిన తండ్రికి నివాళి అర్పించి, ” మరెల్ తర్ దేశా శాటి, జగేల్ తర్ దేశా శాటి ‘(అనగా దేశ స్వాతంత్య్రం కోసం వీరమరణమో లేదా ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసమే జీవించడం) అనే విప్లవాత్మకమైన ప్రతిజ్ఞ చేసి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించడానికి, దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడే విప్లవ సైన్యమును సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తనకు వారసత్వంగా లభించిన మార్షల్ ఆర్ట్స్ / యుద్ధ కళలను నవయువకులకు నేర్పించడం మొదలుపెట్టారు.
1822 సంవత్సరంలో నానా రాస్త్ సర్దార్ సహకారంతో పుణెలోని ‘రాస్తాపేత్’లో ఒక వ్యాయామశాల (అఖాడా) ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి యుద్ధనైపుణ్య శిక్షణ కేంద్రం. లహుజి ప్రభావంతో మాంగ్ కులం వారేకాక అన్ని వర్గాల యువకులు శిక్షణ కోసం ఈ కేంద్రానికి రావడం ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రంలో అన్నిరకాల యుద్ధకళలు యందు యువకులకు శిక్షణ అత్యంత నైపుణ్యంతో ఇచ్చారు.
లహుజి వద్ద శిక్షణ పొందిన వారిలో ప్రముఖుల విషయానికి వస్తే.. మహాత్మా జ్యోతిబా ఫూలే, క్రాంతి భౌ ఖరే, ఉమాజీ నాయక్, క్రాంతివిర్ నానా దర్బరే, వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే, బాల గంగాధర్ తిలక్ , గోపాల్ గణేష్ అగార్కర్, చాపేకర్ బంధువులు, సదాశివరావు గోవాండే, నానా మొరాజి మొదలగు అనేకమంది లహుజి గారి పర్యవేక్షణ, ప్రోద్బలం, శిక్షణతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం, సమాజంలో విప్లవాత్మకమైన, ప్రగతిశీల మార్పులు తీసుకురావడానికి పోరాటాలు చేశారు.
లహుజి వద్ద శిక్షణ పొందిన వారిలో, లహుజికి అతంత్య ప్రియులు, లహుజికి కళ్లులాంటి వారు మాత్రం మహాత్మా జ్యోతిబా ఫూలే (భారత సామజిక విప్లవ పితామహుడు), వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే (భారతదేశ సాయుధ పోరాట పితామహుడు) అని చెప్పవచ్చును. వీరికి లహుజి కొండంత బలం, ధైర్యం ఎలాగో లహుజి కూడా వీరిని తన ఆశయ సాధకులుగా చూడడం జరిగింది.
లహుజి, శూద్రులలో చైతన్యం తీసుకునివచ్చే వివిధ కార్యక్రమాలు చేపడుతున్న మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులకు సంపూర్ణ మద్దతు ఇస్తూ, వారికీ రక్షణ కవచంగా మారింది. లహుజి రక్షణ కవచమును ఛేదించి, ఫూలే దంపతుల ఉద్యమాలకు విఘ్నం కల్గించే పూర్తి సాహసం ఎవరు చేయలేకపోయారు. అందుకే ఫూలే అప్పటి వర్ణవ్యవస్థ కట్టుబాట్లను అధిగమించి, తన సంఘ సంస్కరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే స్థాపించిన బాలికల పాఠశాలలలో చాలా మంది అతి శూద్ర విద్యార్థులను చేర్పించే మహత్కార్యమును లహుజి గారు తన భుజాన వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో అతిశూద్రులకు విద్య అనేది నేరంగా చూసేవారు. బాలికలకు విద్య అనే మాటకు ఆస్కారమే లేదు. ఇంటింటికి తీరుగుతూ, బాలికల తల్లిదండ్రులను ఒప్పిస్తూ ఆ పాఠశాలకు సక్రమంగా వెళ్ళేటట్టు చేశారు. ఆ పాఠశాలలకు కూడా రక్షణ ఇచ్చారు. స్వయంగా తన ఇంటి ఆణిముత్యం అయిన ముక్తా సాల్వేను (మొదటి మహిళా దళిత రచయిత) అందరి కంటే ముందుగా ఫూలే పాఠశాలలో చేర్పించి అందరికి మార్గదర్శుడయ్యారు. మహాత్మా జ్యోతిభా ఫూలే 1873 సంవత్సరంలో ప్రారంభించిన ‘సత్యశోధక్ సమాజ్’ లో కూడా లహుజి గారు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది.
భారతదేశ చరిత్రలోనే అందరికంటే ముందు అనగా బాబాసాహెబ్ (1927 సంవత్సరం), మహాత్మా జ్యోతిభారావు ఫూలే (1868 సంవత్సరం) కన్నా ముందు 1848 సంవత్సరంలోనే అతిశూద్రులు, శూద్రులకు మంచి తాగునీటి సదుపాయాన్ని కల్పించి తన పరాక్రమ శక్తిసామర్థ్యాలతో అప్పటి వర్ణవ్యవస్థకు సవాలు విసిరిన మహానుభావుడే లహుజి. తన వ్యాయామశాల శిక్షణ కేంద్రంకు దగ్గరగా, పూణే పట్టణానికి నడిబొడ్డున 1848 సంవత్సరంలో తన స్వహస్తాలతో ఒక బావిని త్రవ్వి అందరి దాహాన్ని తీర్చడం జరిగింది. లహుజి గారి ధైర్య శక్తిసామర్థ్యాలకు భయపడిన అప్పటి సనాతనులు, రాజరికవాదులు ఆవైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసహించలేదు. తన వద్ద శిక్షణ పొందే విద్యార్థులు అందరు ఆ బావి నుంచి మాత్రమే నీరు తీసుకోనివచ్చి తాగాలని చెప్పి, అందరు సమానమనే సౌభ్రాతృత్వం భావాన్ని పెంపొందించిన మహానుభావుడు. లహుజి గారి శిష్యులలో కొందరు సనాతన వాదులు ఉన్నప్పటికీ, వారు కూడా గురువు ఆదేశాలను ధిక్కరించే సాహసం చేయలేక శిరసావహించేవారు.
భారతదేశ చరిత్ర గతిని మార్చిన మహాపురుషులలో అగ్రగణ్యుడుగా గుర్తింపు పొందాల్సిన లహుజి వర్ణవ్యవస్థ మూలంగా ఆ గుర్తింపు పొందలేకపోయారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం కులం అనే ప్రామాణిక కొలమానం ఆధారంగా గుణం / కర్మలను లెక్కలోకి తీసుకోకుండా, లహుజి గారి చరిత్రను కాలగర్భంలో సమాధి చేయడం జరిగింది. కేవలం ఆంగ్లేయుల రికార్డులలో మాత్రమే లహుజి పనితనం నిక్షిప్తమై ఉండడం మన అదృష్టం. అయినప్పటికీ పువ్వు పరిమళంను ఎలాగైతే ఆపలేమో భారతదేశ చరిత్ర నుంచి లహుజి చరిత్రను కూడా విడదీయలేము అని ఇప్పుడు అవగతం అవుతున్నది. ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్య్రంతో జీవిస్తూ అన్ని సదుపాయాలు పొందడానికి మార్గం వేసిన మహానుభావుడు లహుజి. “మరెల్ తర్ దేశా శాటి, జగేల్ తర్ దేశా శాటి’ (దేశ స్వాతంత్య్రం కోసం వీరమరణమో లేదా ప్రాణం ఉన్నంతవరకు దేశం కోసమే జీవించడం) అను ప్రతిజ్ఞకు కట్టుబడి వివాహం చేసుకోకుండా జీవితాన్నంతా దేశశ్రేయస్సు, సమాజం కోసం అంకితం చేసిన ప్రథమ భారత స్వాతంత్య్ర సమరయోధుడు లహుజి ‘అది క్రాంతిగురు’గా చరిత్రలో అజరామరం అయ్యారు.
గాయక్వాడ్ తులసిదాస్,
రాష్ట్ర అధ్యక్షులు, మాంగ్ సమాజ్ తెలంగాణ,
8106549807
- BREAKING NOW APPఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking Now APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/