సంత్ రవిదాస్ ఒక వ్యక్తి కాదు. ఉద్యమం!
(సంత్ రవిదాసు 646 వ జయంతి సందర్భంగా వ్యాసం)
సంత్ రవిదాసు చర్మకారవృత్తి అవలంబిస్తూనే గొప్పసాధకుడయ్యాడు.” భగవంతుడుఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు అడ్డుగొడలెందుకు? అని ప్రశ్నించారు. తన గుణ కర్మల చేతనే ఉత్తముడవుతాడాని చాటి చెప్పిన మహాత్ముడు సంత రవిదాసు.
ఆగ్రా పట్టణానికి సమీపంలోని దాసపుర గ్రామంలో చెప్పులు కుట్టే కులంలో రవిదాస్ క్రీ.శ.1376-1527 మధ్యకాలంలో జీవించాడు. తండ్రి, అన్నపోషణలో పెరిగాడు. తాను కుట్టిన చెప్పుల జతను అమ్మడానికి వెళ్లినప్పుడు ఒక బీదవానిని చూసి మనసు చలించి, చెప్పులు అతనికి దానం చేశాడు. దాంతో తండ్రి ఇంటి నుండి తరిమేశాడు. ఊరి చివర ఓ గుడిసె వేసుకుని, దైవనామస్మరణతో కాలక్షేపం చేసేవాడు. ప్రజలలోశాంతి, ప్రేమలను అందిస్తూ బోధనచేసేవాడు. ఒకరోజు దేవుడే రవిదాస్ ని పరీక్షచెయడానికి వచ్చాడు. రవిదాస్ వద్దన్నప్పటికి, అన్నికోర్కెలుతీర్చే “పరుసవేది“ అను విలువైన వస్తువును ఇచ్చినా చేతితోముట్టలేదు. దేవుడు దానిని గుడిసెచూరులోపెట్టి వెళ్లి,12ఏళ్లకు తిరిగి వచ్చినప్పటికి,రవిదాస్ దాని వైపు చూడనైనా చూడలేదు.సామాన్య జీవితంలో అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రవిదాస్ గొప్ప ఙ్ఞాని, గొప్ప కవి. వారణాసి రాజ దర్బార్ లోనూ,అలాగే ప్రయాగ కుంభ మేలా లోనూ రవిదాసు ససత్సంగం నిర్వహించినట్లు చెప్తారు. చిత్తడ్ రాణి ఝాలీ, మీరాబాయి అలాగే కాశీ రాజు మొదలైన వారు సంత రవిదాస్ శిష్యరికం తీసుకున్నట్లు కూడా చెబుతారు. స్వామి రామానంద్, సంతకబీర్, ఇతర సాధుసంతులతో ధర్మరక్షణకు యాత్రలు చేశాడనిప్రతీతి. సంతరవిదాస్ జన్మించినకాలంలో ఇస్లాం వ్యాప్తికోసం హిందువులపై మొఘలుల దౌర్జన్యాలకు అంతు లేదు. అలాగే హిందూ సమాజంలోని అగ్రవర్ణాల ఆధిపత్యం కూడా తక్కువేమీకాదు. భక్తిఉద్యమం ద్వారా భేదభావాలు లేని సమాజ నిర్మాణానికి స్వామిరామానంద ఆధ్వర్యంలొ తీవ్రప్రయత్నం జరుగుతున్నది. ఆయనకున్న ప్రముఖమైన శిష్యులలో సంత రవిదాస్ ఒకరు.
ఈ శిష్యులందరూ సుమారుగా నిమ్న వర్గానికి చెందిన వారే. వీరందరూ సామాన్య ప్రజల మధ్య సరళమైన భాషలో ధర్మ సందేశం అందించేవారు. సంత రవిదాస్ ‘భగవాన్ నామ స్మరణ’ యే మూల మంత్రంగా జపిస్తూ జీవించారు. రవిదాస్ నామస్మరణయే హారతిగా, పూజగా, పూలమాలగా తులసీచందనంగా భావించారు. చదువుకున్నది తక్కువైనా గురువుల ద్వారా,సాధుసంతుల సాంగత్యమువల్ల అపరిమిత జ్ణానంపొందాడు. కామ, క్రోధ, మోహ, అహంకారాలు ఎప్పటికీ అతని దరిచేరలేదు. ప్రపంచంలోని అన్నిప్రాణులలో పరమాత్మ వున్నాడని విశ్వసించే నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడు సంత రవిదాస్. బ్రాహ్మణులు కూడా రవిదాస్ పాండిత్యాన్ని చూసి సన్మానించారు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల వారంతా ఒకే జాతికి చెందినవారని, పుట్టుకతోకాదు, చేసిన కర్మ ఆధారంగా కులానికి గౌరవం ఏర్పడిందని అంటారు. కొద్దిమందీ పండితుల అభిప్రాయం ప్రకారం రవిదాస్ తండ్రి పేరు ‘రఘు’, తల్లిపేరు దుర్వినియ, భార్యపేరు‘లేనా, అతని కుమారుడి పేరు విజయదాస్’ అని తెలుస్తున్నది. రవిదాస్ మనుష్యులందరినీ కుల భేదం, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ గౌరవించే వారు. అలాగే కులభేదాలు తొలగనంతవరకు మానవులు ఏకం కాలేరని రవిదాస్ అనే వారు.
భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం
14వ శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న కాలమది. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. అంబేద్కర్ స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యులు కబీర్, సంత్ రవిదాస్లు, ఎవరైతే తాము బతికిన కాలంలో ఎంతోమందిని తన భావజాలంతో ప్రభావితం చేస్తారో వాళ్లే చరిత్ర మలుపులో నిలబడి రాబోయే కాలానికి దిశా నిర్దేశం చేస్తారు. ఇలాంటి వారిలో రవిదాస్ ఒకరు. అందుకే ఆయన అనుమాయిలు ఆయన బంగారు విగ్రహాన్ని జలందర్ నుంచి కాశీ వరకూ మోసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభావం పంజాబ్ నుంచి దేశమంతా విస్తరించింది.
సంత్ రవిదాస్ భక్తి కవుల్లో ఒక ఆధ్యాత్మిక భావాన్నే కాకుండా సామాజిక భావాలనూ అభివృద్ధి చేశారు. బానిస భావాలను వ్యతిరేకించారు. మానసిక బానిసత్వాన్ని, కుల బానిసత్వాన్ని శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. మనిషి స్వతంత్రుడై గౌరవమైన ఆలోచనలతో జీవించాలని, తలవంచి జీవించడాన్ని నిరాకరించాడు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేశాడు. మానవతాపూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటతో చాటారు. సమాజాన్ని మేల్కొలిపే బాటలో పయనించారు.
సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్ధనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు, కలసాదేవి, సంతోఖ్ దాస్ తల్లిదండ్రులు. రవిదాస్, కబీర్కు సమకాలీకుడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక సన్యాసిగానే అంటరానివారి కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషిచేశారు. సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధకురాలయిన అంతఃపురవాసి మీరాబాయి లాంటి వారెందరో రవిదాస్ వెంటనడిచారు. ఆయన పదాలు బనారస్ దాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ల వరకూ ప్రవహించాయి. భక్తకవిగా, ఒక ప్రవక్తగా ఎదిగి ఆయన చేసిన పోరాటం ఈనాటి సమాజానికి ఒక స్ఫూర్తి. ఆయన కవితల్లో అతిసున్నితంగా సందేశం, శాంతి సమానతలు ప్రజల ఆలోచనల్లో అద్భుతమైన ప్రభావం చూపుతాయి. రవిదాస్‌కు కాశీ మహారాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. సాక్షాతూ కాశీ మహరాజ్ రవిదాస్ జ్ఞానానికి పాదాక్రాంతుడై ఆయన్ని సన్మానించాడు. రవిదాస్ జీవితాంతం తన చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా బతికారు. చిత్తోడ్రాజు రాణాసంగా, రాణిఝాలీ దేవిల అభ్యర్థన మేరకు రవిదాస్ దంపతులు చిత్తోడ్ వెళ్లారు. వీరికి అక్కడ రాజమర్యాదలతో స్వాగతం లభించింది. మహారాజు వద్ద అతిథిగా కొంతకాలం అక్కడే ఉన్నారు. చిత్తోడ్ కోటలోనే రవిదాస్ తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెపుతారు.
సమానో మంత్ర.. అనే వేదసారమంతా రవిదాస్ పదాలలో ఉంది. “ ఐసా బహురాజ్ మై జహా మిలైసబన్ కో అక్స్ చోట్ బడో సబ్ సమ్ బపై రైదాస్ రహె ప్రసన్న్ ( ఎక్కడైతే అందరికీ భోజనం లభిస్తుందో, ఎవరూ ఆకలితో నిద్రపోరో.. ఎక్కడ ఎక్కువ తక్కువుల అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటారో.. అలాంటి సమాజాన్ని, అలాంటి పాలనా వ్యవస్థని రవిదాస్ కోరుకుంటున్నాడు). “కులం గురించి ఎవరూ, ఎవర్నీ అడగ కూడదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరూ మనిషి కులానికి చెందినవారే. మానవత్వమే పరమ ధర్మం” అని ఆయన బోధించారు. ఆయన చెప్పే ప్రతి మాటా అనుభవం నుంచి, అధ్యయనం నుంచి, అవగాహన నుంచి మానవతావాదం నుంచి పుట్టుకొచ్చాయి. “నా కులం చమార్. ప్రజలు దాన్ని తక్కువగా చూస్తున్నారు. మాజాతి చనిపోయిన జంతువులను ఊరికిదూరంగా మోసుకెళ్లి పర్యావరణం దెబ్బతినకుండా చూస్తూఉంది. మంచి గాలిని సమాజానికి ప్రసాదిస్తూ, సమాజ హితానికి తోడ్పడుతోంది” అని చాటారు. జాతి వైతాళికులైన అంబేద్కర్ లాంటి వారిపై రవిదాస్, తదితర భక్తి కవుల ప్రభావం ఉంది. రవిదాస్ ఒక వ్యక్తి కాదు. ఉద్యమం. సామాజిక సమరసత కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక ఉత్తేజం, పదవుల లాలసతో నేటి విభజన, విద్వేష రాజకీయాలు గ్రామీణ ప్రజా జీవితాల్ని విచ్చిన్నం చేస్తున్న తరుణంలో సంత్ రవిదాస్ బోధనలు, జీవితం విస్తృత ప్రచారం చేయాలి. సామాజిక సమరసతను నిర్మాణం చేసి సామూహిక ప్రజా జీవితాలలో శాంతిని నింపాలి.
వ్యాసకర్త :
బైరి వెంకటేశం మోచి,
రాష్ట్ర అద్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి,
www.scsubcastes.org
mail : venkateshambyri4090@gmail.com
Mob : 9491994090
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews