హైదరాబాద్: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కన్వీనర్ గా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అందుబాటులో ఉన్న గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నాయకులు, గల్ఫ్ వలసల నిపుణులు, అధికారులతో చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ ఎలక్షన్ మేనిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం’ పేరుతో ఇచ్చిన నాలుగు హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం (చొప్పదండి), డా. మాకునూరి సంజయ్ కుమార్ (జగిత్యాల), కెఆర్ నాగరాజు (వర్ధన్నపేట), డా. ఆర్. భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ ఈరవత్రి, సుంకేట అన్వేష్ రెడ్డి, నాయకులు పి. వినయ్ రెడ్డి (ఆర్మూర్), కూచాడి శ్రీహరి రావు (నిర్మల్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగర్) వలస నిపుణులు అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, లిజీ జోసెఫ్, ఫలియా, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎన్నారై విభాగం అధికారి ఇ. చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముందుగా నాలుగు అంశాలపై ప్రభుత్వం జీఓలు తీయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
◉ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు 2023 డిసెంబర్ 7 నుంచి గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
◉ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీ ఏర్పాటు చేయాలి.
◉ హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేక ‘ప్రవాసి ప్రజావాణి’ కౌంటర్ ఏర్పాటు చేయడం.
◉ గురుకుల పాఠశాల లలో, కళాశాల లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లలో ప్రాధాన్యత కల్పించాలి.