పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన మీడియా సంస్థలను అనేకం చూశాం. జీతాల గురించి అడిగితే ‘ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని మొండిగా వ్యవహరించే బాస్‌లు కూడా అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే మీడియాలో కూడా కొందరు ఉన్నారు. సంస్థలో హెడ్‌గా ఉండి సమయానికి జీతాలు ఇవ్వలేకపోయిందుకు ప్రాణాలు పోగొట్టుకున్న ఒక జర్నలిస్ట్ కథ ఇది. సంజీవ్ సింగ్ అనే బీహార్ వ్యక్తి రెండు దశాబ్దాలు హిందీ మీడియాలో రిపోర్టర్‌గా పని చేశాడు. హెల్త్ రిపోర్టర్‌గా అనేక మందికి తన మాట సహాయంతో ఢిల్లీ ఎయిమ్స్ లాంటి సంస్థల్లో వైద్యం చేయించి ఎందరో ప్రాణాలను కాపాడాడు. వైల్డ్ లైఫ్ రిపోర్టింగ్ కోసం దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరిగి తనదైన ముద్రతో స్టోరీలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.

తెలుగు మీడియాలో అడుగుపెట్టిన సంజీవ్ కొత్తవారిని ప్రోత్సహించాడు. ఇప్పుడు పలు మీడియా సంస్థల్లో కొందరు కాన్ఫిడెంట్‌గా పని చేస్తున్నారంటే సంజీవ్ ఇచ్చిన దైర్యమే అని చాలా మంది జర్నలిస్టులు చెప్పుకుంటారు. ఒకరిద్దరు ఇన్వెస్టర్స్‌ సంజీవ్‌తో Youtube ఛానెల్ పెట్టించారు. 15 మంది స్టాఫ్‌ని రిక్రూట్ చేసుకున్నారు. ఇన్వెస్టర్స్ సడెన్‌గా చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక తన ఆఫీసులో తన క్యాబిన్ సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయాడు. ఉద్యోగులను నిండా ముంచేసి బోర్డు తిప్పేస్తున్న ఐటీ కంపెనీలు, జీతాలివ్వకుండా ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసిన కొన్ని మీడియా సంస్థల అధినేతలు దర్జాగా సమాజంలో బతుకుతున్న ఈరోజుల్లో.. తనను నమ్ముకున్న 15 మంది ఉద్యోగులకు జీతం ఇవ్వలేదనే పశ్చాతాపంతో ప్రాణాలు తీసుకున్న సంజీవ్ సింగ్ గుణం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియా రంగంలోకి ఎన్నో కలలతో అడుగుపెట్టి, ఆశలతో, ఆశయాలతో ముందుకెళ్లిన సంజీవ్ అకాల మరణం, అది కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న పరిణామం తెలుగు మీడియాలో సంజీవ్‌ను గుర్తెరిగిన వారందరినీ శోకసంద్రంలో ముంచేసింది. అంతేకాదు, సంజీవ్ చనిపోవడానికి ముందు రాసిన సూసైడ్ లెటర్.. ఆయన ఎంతటి నిర్వేదంతో ఈ లోకం నుంచి నిష్క్రమించారో కళ్లకు కట్టింది.

ఇది నా కల.. నేను పరిగెత్తడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఇప్పుడు పరిగెత్తే శక్తి లేకుండా అలసిపోయాను. ఇప్పుడు నాలో ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది. ఇక ఉంటాను. సంజయ్ రాసిన సూసైడ్ లెటర్‌కు తెలుగు అనువాదం ఇది. ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయాననే ఆవేదన, న్యాయం చేసేందుకు ఆయన చివరి క్షణం వరకూ పడిన ఆక్రందనకు అక్షర రూపం ఈ లేఖలో కనిపించింది. మీడియా రంగంలోకి ఉవ్విళ్లూరే ఉత్సాహంతో వచ్చి, రిపోర్టింగ్‌లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి.. వృత్తిపరంగా తనకున్న పరిచయాలతో అడిగిన వారికి చేయగలిగినంత సాయం చేసి.. ఆ వృత్తినే నమ్ముకుని పెట్టుబడిదారుల ద్రోహానికి తాను బాధ్యత వహించి, ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయాననే నైరాశ్యంతో.. రెక్కలు విరిగిన పక్షిలా, తెగిన గాలి పటంలా జర్నలిస్ట్ సంజీవ్ సింగ్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం మీడియా రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది…!!

 

By admin