• ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లలో రిజర్వేషన్ల ఉల్లంఘన
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల పొట్టగొడుతున్నారు
  • ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
  • మరో పోరాటానికి సిద్ధం

– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి.

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల రాజ్యాంగ రక్షణలను కాలరాస్తున్నాయని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అన్నారు. ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రాకుండా, ఒకవేళ వచ్చినా ఉన్నత స్థానానికి వెళ్లకుండా ఈ వర్గాలకు న్యాయం చేయవలసిన ప్రభుత్వాలే అన్యాయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రైవేట్ పరం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల పొట్టగొడుతూ ఉపాధి లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను దళిత బహుజనులు ఇప్పటికైనా గమనించి రాజ్యాంగ రక్షణ కోసం, హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.

గడిచిన ఏప్రిల్ 25 న ప్రకటించిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల అర్హత పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓసీ లతో సమానంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా కనీస మార్కులు 30 శాతం గా కేటాయిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా అందరిని ఒకే గాటన కట్టడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం తీవ్రమైన నేరంగా భావిస్తున్నాం. గతంలో 2015 , 2018 సంవత్సరంలో నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లలో ఓసీలకు కనీస అర్హత మార్కులు 40 శాతం, బీసీలకు కనీస అర్హత మార్కులు 35 శాతం, ఎస్సీలకు కనీస అర్హత మార్కులు 30 శాతం గా నిర్ణయించారు కానీ ప్రస్తుత నోటిఫికేషన్లు ఓసి బిసి ఎస్సీ ఎస్టీలకు కనీస అర్హత మార్కులు సమానంగా ఉండటం రాజ్యాంగ విరుద్ధం. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగంలోని అధికరణలు 15,16,46 ప్రకారం ప్రతి రిక్రూట్మెంట్లో ఎంట్రీ లెవల్ లోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓసీ లతో పోల్చినప్పుడు తక్కువ కటాఫ్ మార్కులు పెట్టాలనే నిబంధన ఉంటుంది .ఈ నిబంధనలు ఉల్లంఘించి నోటిఫికేషన్ ఇచ్చిన అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ ను సవరించి ఎస్సీ ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలని, అదేవిధంగా తప్పుగా ప్రచురించ బడిన ప్రశ్నలకు మార్కులు కలపి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళితులు ఎదగాలంటూనే దళితుల ఎదుగుదలను అడ్డుకునే ప్రభుత్వచర్యలను గమనించాలని దళిత బహుజనులను కోరారు. గత సంవత్సరం సెక్రటేరియట్ వేదికగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లకు ఎసరు పెట్టేటువంటి విధానానికి సర్కారు పాల్పడడం దారుణం. రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్ పొందిన ఎస్సీ ఎస్టీలకు తర్వాత కల్పించబడే ప్రమోషన్లలో “కాన్సీక్వెన్సి సీనియారిటీ” వర్తించదు అంటూ సర్కారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈవిధానాన్ని ముందు సెక్రటేరియట్లో తర్వాత రాష్ట్రమంతటా అన్ని శాఖల్లో అమలుపరచడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దీని వల్ల ఏ పోస్టులో ఉన్నోళ్లు ఆ పోస్ట్ లోనే రిటైర్ అవుతారని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తున్న గాని ఉత్తర్వులు ఇవ్వడం దారుణం. పార్లమెంటులో 85 వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించిన “క్యాచ్ ఆఫ్ రూల్ ” విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ప్రమోషన్లు రావని ఏపోస్టులో ఉన్న దళిత ఉద్యోగులు ఆ పోస్టులోనే రిటైరయ్యే పరిస్థితి వస్తుందని, మిగతా ఉద్యోగుల లాగా ఉన్నత ఉద్యోగానికి అర్హతపొందే అవకాశం కోల్పోతున్నామని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాచ్ ఆఫ్ రూల్ తొలగించిన తర్వాత రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్ పొందిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగికి ఆ రోజు నుంచే కాన్సీక్వెన్షియల్ సీనియార్టీ వర్తిస్తుంది దీనివల్ల ఇతర ఉద్యోగుల లాగా పైస్థాయి ప్రమోషన్లకు అర్హులవుతారు. 85 వ రాజ్యాంగ సవరణను ఆధారంగా చేసుకొని ఆనాటిఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ 26 ను తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీలకు కాన్సీక్వెన్షియల్ సీనియార్టీ వర్తింపజేసీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది . 2018లో హైకోర్టు కూడా జీవో నెంబర్ 26 ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26 ను తొలగిస్తూ జీవో నెంబర్ 247 ను తీసుకురావడం జరిగింది. దీనివల్ల దళిత గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది . ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈ డబ్ల్యూ ఎస్) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం దీనివల్ల ఓపెన్ కేటగిరి లో వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు , బహుజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తు త్వరలోనే ఎస్సీ ఉపకులాల పోరాట సమితి అధ్వర్యంలో మిగతా దళిత గిరిజన సంఘాలతో కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.

By admin